Telangana News: ఆ విషయం కేటీఆర్‌కు తెలియకపోవడం బాధాకరం: రేవంత్‌రెడ్డి

రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్‌ తీరిక లేకుండా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Updated : 30 Mar 2022 17:21 IST

దిల్లీ: రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్‌ తీరిక లేకుండా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఉన్న రేవంత్‌.. ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అన్నదాతల పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిబద్ధత కేటీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్‌ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, ఉపాధి హామీ, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనత అని రేవంత్‌ ప్రశ్నించారు. రూ.70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని గుర్తు చేశారు. ఇక్రిశాట్‌ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చామని పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా.. అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేమీ కాదని రేవంత్ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని