Partha Chatterjee: పార్థా ఛటర్జీని బహిష్కరించాలి.. టీఎంసీ నేతల డిమాండ్‌

పాఠశాల ఉద్యోగుల నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ (West Bengal) మంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ (Partha Chatterjee)పై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Published : 28 Jul 2022 13:46 IST

కోల్‌కతా: పాఠశాల ఉద్యోగుల నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ (West Bengal) మంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ (Partha Chatterjee)పై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయను తక్షణమే పదవుల నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరించాలని టీఎంసీ (TMC) నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన పార్టీకి అప్రతిష్ట తీసుకొచ్చారని దుయ్యబట్టారు.

ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చేపట్టిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. పార్థా అత్యంత సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పార్థా, అర్పితను ఈడీ అరెస్టు చేసింది.

ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ ప్రతిపక్ష భాజపా, సీపీఎంలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్‌ దీనిపై స్పందించారు. ఆ మంత్రి కారణంగా పార్టీ మొత్తం పరువు పోయిందని బుధవారం వ్యాఖ్యానించి ఘోష్‌.. నేడు మరో ట్వీట్ చేశారు. ‘‘మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలని పార్థా ఛటర్జీ అడుగుతున్నారు. ఆయన ఏ తప్పు చేయకపోతే ఆ విషయాన్ని బహిరంగంగా ఎందుకు చెప్పట్లేదు. అర్పితా ముఖర్జీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు అనట్లేదు? పార్టీ అధిష్ఠానంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయనను తక్షణమే మంత్రి పదవితో పాటు పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించాలి. టీఎంసీ నుంచి బహిష్కరించాలి. ఒకవేళ నా వ్యాఖ్యలు తప్పైతే నన్ను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించే హక్కు పార్టీకి ఉంది’’ అని కునాల్ ఘోష్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. మరో టీఎంసీ అధికార ప్రతినిధి దెబాంగ్షు భట్టాచార్య కూడా పార్థాను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాగా.. పార్థా ఛటర్జీ వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తప్పు చేస్తే తాను ఎవరినీ వదిలపెట్టబోనని చెప్పిన విషయం తెలిసిందే. మంత్రి అయినా సరే చర్యలు తీసుకుంటామని దీదీ అన్నారు. పార్థా ఛటర్జీ ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని