INDIA Bloc: ‘ఇండియా’ కూటమికి బీటలు.. దీదీ బాటలోనే ఒంటరి పోరుకు ఆప్‌

INDIA Bloc: పంజాబ్‌లో తాము ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌తో పొత్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన కాసేపటికే ఆప్‌ తమ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

Updated : 24 Jan 2024 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరు కోసం జట్టుగా ఏర్పడిన విపక్షాల ‘ఇండియా (INDIA Bloc)’ కూటమికి బీటలు వారుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో సార్వత్రిక ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) కూడా కాంగ్రెస్‌ (Congress)కు షాకిచ్చింది. పంజాబ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించింది.

మమతా బెనర్జీ ప్రకటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ స్పందిస్తూ హస్తం పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ‘‘పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆప్‌ బరిలోకి దిగుతుంది. ఇందుకోసం 40 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశాం. సర్వే చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తాం. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో మేం విజయం సాధిస్తాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన దీదీ

సీట్ల సర్దుబాట్లలో విభేదాల వల్లే..

అంతకుముందు మమతా బెనర్జీ ఇదే ప్రకటన చేశారు. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌తో తాము సంప్రదింపులు జరపడం లేదన్నారు. బెంగాల్‌ వరకు సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, జాతీయస్థాయిలో పొత్తుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే, సీట్ల సర్దుబాటులో విభేదాల వల్లే ఇండియా కూటమికి బీటలు పడుతున్నట్లు తెలుస్తోంది.

బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్‌కు కేవలం రెండింటిని మాత్రమే ఇవ్వాలని టీఎంసీ భావించింది. ఇందుకు హస్తం పార్టీ నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయమై టీఎంసీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలోనే పొత్తుకు దీదీ సమ్మతించలేదని తెలుస్తోంది. అటు దిల్లీ, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరట్లేదనే వార్తలు వస్తున్నాయి.

దీదీ లేకుండా ‘ఇండియా’ ఊహించలేం: కాంగ్రెస్‌

ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. దీదీ లేకుండా విపక్షాల కూటమి (INDIA)ని ఊహించుకోలేమని పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. ఇండియా కూటమికి మూలస్తంభమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా అస్సాంలో మాట్లాడిన ఆయన.. భాజపాను ఓడించేందుకు ఏదైనా చేస్తామని మమత గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

మేం అనుకున్నదే..: ఉద్ధవ్‌ టీం

లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేయడాన్ని తాము ముందే ఊహించామని శివసేన (యూబీటీ) పేర్కొంది. కాంగ్రెస్‌తో కలిసి దీదీ నడిచే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే, మహారాష్ట్రలో మాత్రం ‘ఇండియా’ కూటమి పటిష్ఠంగానే ఉందని ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. మమతా బెనర్జీ బెంగాల్‌లో సింహంలా పోరాడుతున్నారని.. రాష్ట్రం కోసం ఆ పోరాటం ఎంతో ముఖ్యమన్నారు.

అధీర్‌ వాటికి దూరంగా ఉండాలి: ఆప్‌

రాజకీయ కూటమిలో సీట్ల పంపకం అనేది సవాలేనని ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీపై కాంగ్రెస్‌, వామపక్షాలు పోరాడుతున్న వేళ.. సీట్ల పంపకం కాస్త ఇబ్బందికర అంశమేనన్నారు. ఇటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని