Mamata Banerjee: బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన దీదీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. 

Updated : 24 Jan 2024 14:06 IST

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ వెల్లడించారు.

‘బెంగాల్‌ వరకు సీట్ల పంపకం విషయంలో మా పార్టీ కాంగ్రెస్‌తో టచ్‌లో లేదు. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదు. మా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారతస్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని మమత స్పష్టం చేశారు.

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు తృణమూల్‌(TMC) ముందుకు వచ్చిందని సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. మమత ఇందుకు అంగీకరించని నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్‌ చౌధరి ఆమెపై విమర్శలు చేశారు. ఆమె అవకాశవాదని,  సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్‌కు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్యే  బెంగాల్‌ సీఎం నుంచి తాజా ప్రకటన వెలువడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో కాంగ్రెస్‌ 4 స్థానాలు గెలుచుకోగా.. 2019లో ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. ఈ ప్రదర్శన కూడా ఆ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తికి కారణమని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రపైనా మమత విమర్శలు చేశారు. గురువారం ఈ యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. ‘వారు మా రాష్ట్రానికి వస్తున్నారు. దాని గురించి నాకు సమాచారం ఇవ్వాలన్న మర్యాద వారికి లేదు’ అని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోకి ప్రవేశించిన తర్వాత ఈ యాత్రలో తమ పార్టీ పాల్గొనకపోవచ్చని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. ‘కాంగ్రెస్ నుంచి మాకు అధికారిక ఆహ్వానం అందలేదు. ఒకవేళ అందినా.. మేం అందులో పాల్గొనకపోవచ్చు’ అని తెలిపారు.

స్పందించిన కాంగ్రెస్‌.. 

‘భాజపాను ఓడిస్తామని, అందుకోసం ఏమైనా చేస్తామని మమత బెనర్జీ చెప్పారు. మమతాజీ, తృణమూల్ పార్టీ.. ఇండియా కూటమికి బలమైన పిల్లర్‌ అని రాహుల్ స్పష్టంగా చెప్పారు. ఆమె లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేం. అలాగే భారత్‌ జోడో న్యాయ యాత్రలో చేరాల్సిందిగా కూటమికి చెందిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు పలుమార్లు ప్రకటించారు’ అని కాంగ్రెస్ వెల్లడించింది. భాజపాను ఓడించాలనే లక్ష్యంతో గత ఏడాది విపక్ష ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. కానీ ఈ ప్రకటనలతో విపక్ష పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని