Sharad Yadav: శరద్‌ యాదవ్‌ వల్లే లాలూకు దక్కిన సీఎం కుర్చీ..!

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది రాజకీయ నేతలకు శరద్‌ యాదవ్‌ (Sharad Yadav) మార్గనిర్దేశం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర అత్యంత కీలకం.

Updated : 13 Jan 2023 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి, జేడీ-యూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ (Sharad Yadav)కు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. గురువారం రాత్రి కన్నుమూశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నేతలకు మార్గనిర్దేశం చేసిన శరద్‌.. ఒకానొక సమయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన వల్లే లాలూ సీఎం అయ్యారన్నది బహిరంగ రహస్యమే..!

శరద్‌ యాదవ్ (Sharad Yadav) మధ్యప్రదేశ్‌లో జన్మించినప్పటికీ.. ఆయన రాజకీయ బలగం మాత్రం బిహార్‌ (Bihar)లోనే ఉంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాజకీయ ఎదుగుదలలో శరద్‌ కీలక ప్రాత పోషించారు. ఆయనే లేకపోతే లాలూ  ‘సీఎం’ ఆశ కలగానే మిగిలిపోయేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. 1990లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత సీఎం ఎంపిక విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అప్పటి ప్రధానమంత్రి వీపీ సింగ్‌ అండతో మాజీ సీఎం రామ్ సుందర్‌ దాస్‌ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే అప్పటి ఉప ప్రధాని దేవీ లాల్‌ మద్దతుతో శరద్‌ యాదవ్‌.. పీవీ సింగ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రామ్‌ సుందర్‌ దాస్‌ను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకునే ప్రయత్నాలకు అడ్డుపడ్డారు. దీంతో శాసనసభా పక్షంలో సీఎం ఎంపికకు ఓటింగ్‌ అనివార్యమైంది. ఈ క్రమంలోనే శరద్‌ యాదవ్‌ బిహార్‌కు పరిశీలకులుగా వెళ్లారు. ఆ సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నీతీశ్‌ కుమార్‌ (ప్రస్తుత బిహార్‌ ముఖ్యమంత్రి) ఎంపీలుగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత రామ్‌ సుందర్‌ దాస్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గట్టి పోటీ అని నిర్ణయించి ఆయనను పోటీలోకి తెచ్చారు.

ఈ పోటీలో లాలూను గెలిపించేందుకు శరద్‌ యాదవ్‌ గట్టిగా ప్రయత్నించారు. జనతాదళ్‌ కీలక నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ను సంప్రదించి సాయం కోరారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ తన సన్నిహితుడు రఘునాథ్‌ ఝాను సీఎం రేసులోకి దింపారు. దీంతో రామ్‌సుందర్‌ దాస్‌కు ఓట్లు చీలిపోయాయి. రాజ్‌పుత్‌ ఎమ్మెల్యేలు రఘునాథ్‌ ఝాకు మద్దతుగా ఓటేశారు. ఇది ఫలించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్వల్ప మెజార్టీతో సీఎం పదవికి ఎంపికయ్యారు. అయితే కథ అక్కడితో ముగియలేదు. శాసనసభ పార్టీ ఎన్నికల్లో లాలూ విజేతగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి గవర్నర్‌ నుంచి ఆహ్వానం అంత సులువుగా లభించలేదు. దీంతో శరద్‌ యాదవ్‌ మళ్లీ రంగంలోకి దిగడంతో లాలూ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

శరద్‌ నాకు పెద్దన్న: లాలూ

తన రాజకీయ జీవితంలో చాలా కాలం వెన్నంటి నిలిచిన శరద్‌ యాదవ్‌ మరణంపై లాలూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స కోసం సింగపూర్‌లో ఉన్న ఆయన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇందులో శరద్‌ను తన బడే భాయ్‌(పెద్దన్న)గా అభివర్ణించారు. తమ మధ్య రాజకీయంగా పోటీ, విభేదాలు ఉన్నా.. అది ఎప్పుడూ శత్రుత్వంగా మారలేదంటూ శరద్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగభరితులయ్యారు.

శరద్‌ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో జేడీ-యూ ఆవిర్భవించాక తొలి జాతీయాధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత భాజపాతో జేడీయూ పొత్తు విషయంలో నీతీశ్‌తో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని, పార్టీ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో 2018లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీని సొంతంగా ఏర్పాటు చేసుకుని, 2020 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో దానిని విలీనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని