Smriti Irani: రాహుల్ ఇంకా వయనాడ్‌లో ఉంటే..: కాంగ్రెస్‌ నేతపై స్మృతి ఇరానీ తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ).. అమేఠీ నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. 

Updated : 23 May 2023 11:17 IST

తిరువనంతపురం: కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi )పై భాజపా నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇంకా వయనాడ్( Wayanad) ఎంపీగా ఉంటే.. ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా గతంలో అమేఠీ(Amethi) ప్రజల దుస్థితే ఉండేదని వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ నిర్వహించి రాష్ట్ర స్థాయి మహిళా కార్మిక సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు.

‘రాహుల్.. అమేఠీ ఎంపీగా ఉన్నంతకాలం 80 శాతం మంది ప్రజలు విద్యుత్ సరఫరాలేక చీకట్లో మగ్గేవారు. అక్కడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లేదు. మెడికల్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, సైనిక పాఠశాల, జిల్లా స్థాయి ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం వంటి వైద్య సదుపాయాలు ఏవీ లేవు. ఒక్కసారి ఆయన వెళ్లిపోగానే.. అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు వచ్చాయి. అందుకే ఆయన ఇంకా వయనాడ్‌లోనే ఉంటే.. గతంలో అమేఠీకి పట్టిన గతే పడుతుంది. ఆయన వయనాడ్‌లో లేకుండా మీరే చూసుకోవాలి. నేను అమేఠీ లేక దిల్లీలో ఎక్కడ ఉన్నా వయనాడ్(Wayanad) గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను’ అని ఇరానీ(Smriti Irani) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు.

‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం దావాలో గుజరాత్‌లోని ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ప్రజాపాతినిధ్య చట్టం ప్రకారం.. రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. దీనిని రాహుల్ ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేశారు.

ఇదిలా ఉంటే.. 2004 నుంచి 2019 వరకు రాహుల్(Rahul Gandhi) అమేఠీ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. అమేఠీలో స్మృతి(Smriti Irani) చేతిలో ఓటమి పాలయ్యారు. మరోస్థానమైన కేరళలోని వయనాడ్‌(Wayanad) నుంచి మాత్రం విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని