United We Stand: కలిసే పోరాడతాం.. కమలదళంపై విపక్షాల ‘దండు’యాత్ర

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ‘మేం ఐక్యంగా నిలిచాం’ (యునైటెడ్‌ వియ్‌ స్టాండ్‌) అనేది తమ నినాదంగా ప్రకటించాయి.

Updated : 18 Jul 2023 09:59 IST

భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా పావులు
బెంగళూరులో మొదలైన ప్రతిపక్ష నేతల భేటీ
పవార్‌ మినహా 26 పార్టీల నేతల హాజరు

బెంగళూరు, ఈనాడు-బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ‘మేం ఐక్యంగా నిలిచాం’ (యునైటెడ్‌ వియ్‌ స్టాండ్‌) అనేది తమ నినాదంగా ప్రకటించాయి. ఇటీవల పట్నాలో తొలి విడత సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు రెండో విడతగా సోమవారం బెంగళూరులో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌ మినహా ఆహ్వానాలు అందుకున్న మిగతా విపక్ష నేతలంతా హాజరయ్యారు. కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా తొలిరోజు సమాలోచనలు జరిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో సాయంత్రం తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు విపక్ష నేతలంతా హాజరయ్యారు. సమావేశాల కోసం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు.

సమావేశంలో సోనియా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పక్కపక్కనే ఆశీనులయ్యారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రెండోరోజు సమావేశాల్లో లాంఛనప్రాయమైన చర్చలకు ఎజెండాగా ఏయే అంశాలు ఉండాలనేది నేతలు తొలిరోజు భేటీలో స్థూలంగా మాట్లాడుకున్నారు. ఇదో మంచి సమావేశమని మమత తెలిపారు. దేశ రాజకీయాలను ఈ సమావేశం ఒక మలుపు తిప్పుతుందని నేతలు పేర్కొన్నారు. ఒంటిచేత్తో విపక్షాలను ఓడించేస్తామన్న భాజపా ఇప్పుడు ఎన్డీయే కూటమిలోకి కొత్తవారిని చేర్చుకోవడంపై దృష్టి సారించాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. సోనియా, ఖర్గే, రాహుల్‌లతో పాటు సీఎంలు మమతాబెనర్జీ (పశ్చిమ బెంగాల్‌-టీఎంసీ), నీతీశ్‌ కుమార్‌ (బిహార్‌-జేడీయూ), ఎం.కె.స్టాలిన్‌ (తమిళనాడు-డీఎంకే), అరవింద్‌ కేజ్రీవాల్‌ (దిల్లీ-ఆప్‌), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌-ఆప్‌), హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌-ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా), మాజీ ముఖ్యమంత్రులు- అఖిలేశ్‌ యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర), లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (బిహార్‌), మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్‌), సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్‌డీ) తదితరులు తొలిరోజు సమావేశంలో పాల్గొన్నారు. తొలి సమావేశంలో 24 పార్టీలు పాల్గొనగా ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు వచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వెల్లడించారు. కర్ణాటక విపక్షం జేడీ(ఎస్‌)ను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ వెల్లడించింది. మంగళవారం లాంఛనప్రాయమైన చర్చలు జరగనున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపక్ష పార్టీల భేటీ కొనసాగనుంది.

శరద్‌ పవార్‌ హాజరుపై సందిగ్ధం

విపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాల సమన్వయం, కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారులో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ  వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్‌సీపీలో చీలిక నేపథ్యంలో సొంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆయన తలమునకలై ఉన్నారు. బెంగళూరుకు పవార్‌ వెళ్లబోరన్న వార్తలూ ఓ దశలో వినిపించాయి. మంగళవారం భేటీకి ఆయన హాజరవుతారని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి ప్రకటించారు. పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి సమావేశానికి వెళ్తారని తెలిపారు.


భాజపా పతనం మొదలైంది

- సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం

భాజపా పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ధరల పెరుగుదల, ఆర్థికపతనం ప్రారంభమై.. దళితులు, రైతుల జీవనం దుర్భరంగా మారింది. కర్ణాటకలో మోదీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.


పాత మిత్రులను పోగేసిన భాజపా

- మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

విపక్షాల ఐక్యత చూసి భాజపా భీతిల్లినట్లే ఉంది. అందుకే గతంలో విడిపోయిన మిత్రులను పోగు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదు కాని పార్టీలనూ ఏకం చేశారు. వారి మిత్రుల పేర్లేమిటో కూడా తెలియదు. సంఖ్యాబలం చూపేందుకే 30 పార్టీలతో కలిసి మాతో పోటీ పడుతున్నారు. మేం ఉమ్మడిగా పోరాడతాం. మమ్మల్ని విడదీయాలనే యత్నాలను తిప్పికొడతాం.


భాజపా ఓటమి ఖాయం

- అఖిలేశ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయం. విపక్షాల ఐక్యత చూసి భాజపా కంగారు పడినట్లుంది. మా సమావేశానికి పోటీగా వారి మిత్రపక్షాలతో సమావేశమయ్యారు.  


తదుపరి సర్కారు విపక్షాలదే

- సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

పతనమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు విపక్షాలన్నీ ఒక్కటి కావాలి. ఇప్పటికే విపక్షాలన్నీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. 2024లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నాం. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి మద్దతు సాధ్యపడదు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల విధానాలతోనే పోటీ చేయబోతున్నాం.


ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు?

విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ జోరందుకుంది. ఇది అంత ముఖ్య విషయం కాదని పట్నా సమావేశంలోనే నేతలు స్పష్టం చేసినా, అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్‌ జోడో యాత్రతో ప్రజల నేతగా మారిన రాహుల్‌ గాంధీయే సరైన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్‌ నేతలు బలంగా వాదిస్తున్నారు.


విపక్షాలది అవకాశవాదుల సమావేశం: భాజపా

విపక్ష నేతల సమావేశం నేపథ్యంలో భాజపా తీవ్ర విమర్శలు చేసింది. అవకాశవాదులు, అధికార దాహంతో కూడిన నేతల భేటీగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించింది. ఇలాంటి కూటమితో దేశానికి వర్తమానంలో, భవిష్యత్‌లో ఎలాంటి మేలు జరగదని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని