సోనియా రాజీనామా.. ఖండించిన కాంగ్రెస్‌!

పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ అవసరం, మార్పులు సూచిస్తూ  23 మంది కాంగ్రెస్‌ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి ఆదివారం లేఖ రాశారు. తాజాగా దీనిపై సోనియా గాంధీ స్పందించినట్లు  పార్టీ వర్గాలు తెలిపాయి.....

Published : 23 Aug 2020 20:50 IST

దిల్లీ: పార్టీలో సమర్థ శాశ్వత నాయకత్వ అవసరం, పార్టీలో కొన్ని మార్పులు సూచిస్తూ 23 మంది కాంగ్రెస్‌ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి ఇటీవల లేఖ రాశారు. దీనిపై సోనియా గాంధీ తన స్పందనగా.. అందరం కలిసి ఉమ్మడిగా కొత్త అధ్యక్షుడిని వెతుకుదామని, పార్టీ సారథ్య బాధ్యతలను మోయలేనని వారికి బదులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు సోమవారం జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఓ ప్రకటనలో ఖండించారు.

మరోవైపు సోమవారం జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ కార్యాలయ మార్పు వంటి విషయాలపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఒక వేళ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉంటే, గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని లేదా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సీడబ్ల్యూసీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, గాంధీ కుటుంబ నాయకత్వానికే పలువురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని