Andhra news: చంద్రబాబుపై రాళ్ల దాడి.. ఆ ఇద్దరి ప్లానే: తెదేపా నేతల ఫైర్‌

తెదేపా అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ దాడి ప్రణాళిక సీఎం జగన్‌, ఐప్యాక్‌దేనంటూ మండిపడ్డారు. వైకాపా సర్కార్‌ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 22 Apr 2023 17:40 IST

అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)పై నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ దాడి ప్రణాళిక సీఎం జగన్‌, ఐ-ప్యాక్‌దేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రూట్‌మ్యాప్‌ తెలుసుకుని మరీ దాడి చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని నిలదీశారు. జగన్‌ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలకు పోలీసులు అనుమతిస్తారా?అని ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ రౌడీ మూకలను ముందస్తు అరెస్టు ఎందుకు చేయలేదన్నారు. కుట్ర, దాడులు, పోలీసు వైఫల్యాలపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి జరగబోతోందని ముందే డీజీపీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. రోడ్డుపై మంత్రి చొక్కావిప్పి వీధి రౌడీలా ప్రవర్తించారన్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలను రెచ్చగొట్టి ఎస్సీలపై కాల్పులు జరిపే కుట్ర చేశారంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

మంత్రి సురేష్‌ను బర్తరఫ్‌ చేయాలి.. చినరాజప్ప

చంద్రబాబుపై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఆదిమూలపు సురేష్‌ వీధిరౌడీలా ప్రవర్తించడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే మంత్రిపదవి నుంచి ఆయన్ను గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాడులపై పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షాలను నిలువరించాలనుకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ప్రజలు డిసైడ్‌ అయ్యారు.. జగన్‌ ఇంటికే.. యనమల

చంద్రబాబుపై రాళ్ల దాడి జగన్‌ అరాచక పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు భద్రతపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. సీఎం జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో తెదేపావిజయం ఖాయమన్నారు.

అసలు పోలీసులేం చేస్తున్నారు?: ఆనందబాబు

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆక్షేపించారు. చంద్రబాబు ర్యాలీని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దళితుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి.. దళితులకు ఉన్న పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మాస్క్‌లు అడిగిన డాక్టర్‌ను పిచ్చోడనే ముద్రవేసి చంపారు. సీఎం సొంత జిల్లాలో దళిత డాక్టర్‌ అచ్చెన్నను హత్య చేసినా పట్టించుకోలేదు’’ అంటూ వైకాపా సర్కార్‌ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మంత్రి సురేశ్‌ వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నారు: సూర్యారావు

తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సభలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి ఓర్వలేకే.. వైకాపా దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబుపై వైకాపా.. దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు కాన్వాయిపై రాళ్లదాడి జగన్‌ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. జగన్‌ని ఆదర్శంగా తీసుకొని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వీధి రౌడీలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అయన్ని తక్షణమే మంత్రి పదవి నుంచి గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

రౌడీ రాజకీయానికి పరాకాష్ట: గంటా శ్రీనివాసరావు

తెదేపా అధినేత చంద్రబాబు పర్యటననను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించడం దురదృష్టకరమని మాజీ మంత్రి,  విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కాన్వాయ్‌పై రాళ్లు విసరడం వైకాపా రౌడీ రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే అధికార వైకాపా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. అప్పట్లో జగన్ పాదయాత్రకు తెదేపా అడ్డంకులు సృష్టించి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ప్రోత్సహించడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదన్న ఆయన.. దాడి చేసిన వారిని, చేయించిన వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి హోదాలో హుందాగా వ్యవహరిస్తూ, అందరికీ ఆదర్శంగా నలివాల్సిన ఆదిమూలపు సురేశ్‌ చొక్కాలు చించుకొని, అనుచరులను ఉసిగొల్పుతూ వీధి రౌడీలా ప్రవర్తించారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని