Chandrababu: బటన్‌ నొక్కింది ఎంత.. ప్రజాధనం బొక్కింది ఎంత?: చంద్రబాబు

మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీయే ప్రభుత్వం రావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 31 Mar 2024 17:53 IST

మార్కాపురం: మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీయే ప్రభుత్వం రావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళం సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రతి రోజు బటన్‌ నొక్కా.. బటన్‌ నొక్కా అని జగన్‌ చెబుతున్నారు. బటన్‌ నొక్కింది ఎంత.. ప్రజాధనం బొక్కింది ఎంత? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  వైకాపా అరాచకాలపై ప్రజలంతా చర్చించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదో.. నష్టం చేసే పార్టీ ఏదో బేరీజు వేయాలని కోరారు.

మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా...

‘‘ఎక్కువ పేదరికం ఉండే డివిజన్‌ మార్కాపురం. మార్కాపురానికి నీరు ఇవ్వాలనే వెలిగొండకు భూమిపూజ చేశా. మేం ఉంటే 2020కే ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చేది. వెలిగొండ పూర్తయితే 15లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. వెలిగొండలో పెండింగ్‌లో ఉన్న 20శాతం పనులు పూర్తి చేయలేకపోయారు. వెలిగొండ భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చారా? పూర్తి కాకుండానే ఆ ప్రాజెక్టును జగన్‌ ప్రారంభించారు. మేం అధికారంలోకి వచ్చాక పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.  మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం. రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చాం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక పోర్టు పనులు ఆగిపోయాయి. 

రూ.13లక్షల కోట్ల అప్పు ఎవరు కడతారు?

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. సంక్షేమ పథకాలను 1983లోనే ఎన్టీఆర్‌ ప్రారంభించారు. జగన్‌.. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారు.  సంక్షేమ పథకాల పేరుతో పది రూపాయలు ఇచ్చి రూ.100 దోచుకున్న జలగ ఈ ముఖ్యమంత్రి. సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని హామీ ఇస్తున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా? సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా? రూ.13లక్షల కోట్ల అప్పు సాక్షి పత్రిక, భారతి సిమెంటు కడతాయా?.. ప్రజలే కట్టాలి. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రం వద్ద మెడలు దించారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నా.. చేశారా? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు ఇచ్చారా? వారంలో సీపీఎస్‌ రద్దు అన్నారు.. చేశారా? అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని