Ayyanna patrudu: మంత్రులు చేసిన పనులే చెప్పా.. సీఎంను తిట్టలేదు: అయ్యన్న పాత్రుడు

తెదేపా అధినేత చంద్రబాబును చంపేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం

Updated : 17 Sep 2021 20:06 IST

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబును చంపేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మాజీ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో గురువారం కోడెల విగ్రహావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు సీఎం, మంత్రులపై విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌, పార్టీ శ్రేణులు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై విశాఖ నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న  స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు చేసిన పనులు మాత్రమే సభలో చెప్పానన్నారు. 

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్ధతి కాదు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రిని నేను తిట్టలేదు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నాను. నా వ్యాఖ్యలపై వైకాపా శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించాను. నా మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి’’ అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని