రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్‌

ఇటీవల హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం పరామర్శించిది.

Updated : 24 Aug 2021 15:01 IST

గుంటూరు: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హెల్దేర్‌ అన్నారు. గుంటూరులో రమ్య కుటుంబాన్ని ముగ్గురు సభ్యుల జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం పరామర్శించింది. ఘటనకు దారి తీసిన పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై బృందం ఆరా తీసింది. సుమారు 20 నిమిషాల పాటు రమ్య ఇంటి వద్దే ఉండి వివరాలు తెలుసుకుంది. అనంతరం అరుణ్‌ హెల్దేర్‌ మీడియాతో మాట్లాడుతూ రమ్య హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

భాజపా మహిళా మోర్చా నేతల నిరసన

జాతీయ ఎస్సీ కమిషన్‌ పర్యటన సందర్భంగా గుంటూరులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కమిషన్‌ సభ్యులను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసేందుకు యత్నించగా పోలీసులు వారిని అనుమతించలేదు. దీన్ని నిరసిస్తూ భాజపా మహిళా మోర్చా నేతలు నిరసనకు దిగారు. కలిసేందుకు తమను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు వారిని బలవంతంగా నెట్టేశారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమ్య ఇంటి వైపు దూసుకెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ ఘటనలో నళిని అనే భాజపా నేత సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల వైఖరిపై భాజపా మహిళా నేతలు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎస్సీ కమిషన్‌కు అమరావతి దళిత ఐకాస వినతిపత్రం

వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక దళితులపై వేధింపులు పెరిగిపోయాయని అమరావతి దళిత ఐకాస ఆరోపించింది. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందాన్ని దళిత ఐకాస నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాజధాని తరలింపుతో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని.. తమపై జరుగుతున్న దాడులను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు నేతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని