Winter session: కాంగ్రెస్​కు ఝలక్​.. విపక్షాల భేటీకి టీఎంసీ దూరం

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్​కు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ (టీఎంసీ) ఝలక్​ ఇచ్చింది.....

Updated : 28 Nov 2021 11:14 IST

దిల్లీ: పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్​కు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ (టీఎంసీ) ఝలక్​ ఇచ్చింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్​తో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా లేమని ప్రకటించింది. అయితే, వివిధ అంశాలపై ఇతర విపక్షాలకు సహకరిస్తామని టీఎంసీ సీనియర్​ నేత ఒకరు స్పష్టం చేశారు. నవంబర్​ 29న కాంగ్రెస్​ నేత మల్లికార్జున్​ ఖర్గే పిలుపునిచ్చిన విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని తెలిపారు. కాంగ్రెస్​, టీఎంసీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ క్రమంలో అంతర్గతంగా నేతల మధ్య సమన్వయం చేస్తూ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

‘శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్​ పార్టీతో కలిసి నడిచే ఆలోచన లేదు. కాంగ్రెస్​ నేతలు ముందు వారి మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలి. సొంత ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతర పార్టీలతో దోస్తీ కోసం ప్రయత్నించాలి. ప్రజాప్రయోజనాల కోసం వివిధ అంశాలను లేవనెత్తుతూ.. ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతాం’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పేర్కొన్నారు. భాజపాపై పోరాటానికి కాంగ్రెస్​తో కలిసేందుకు ఇష్టపడకపోవటంపై ప్రశ్నించగా.. ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని పేర్కొన్నారు. నవంబర్​ 29న బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్లో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని అన్నారు.

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని