Akhilesh Yadav: స్వరం మార్చిన అఖిలేశ్‌.. ‘ఇండియా’ కూటమిలోనే ఎస్పీ!

సమాజ్‌వాదీ పార్టీ ఇండియా కూటమిలోనే కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ తెలిపారు.

Published : 30 Oct 2023 19:29 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhyapradesh Assembly Elections) కాంగ్రెస్‌ పార్టీతో విభేదాలు తలెత్తడంతో ఇండియా (INDIA) కూటమిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తాజాగా స్వరం మార్చారు. కూటమి నుంచి వైదొలిగే అవకాశాన్ని పరిశీలిస్తుట్లు గతంలో చెప్పిన ఆయన... సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. సమాజ్‌వాదీపార్టీ ‘ఇండియా’లోనే కొనసాగుతుందని చెప్పారు. అయితే రాష్ట్ర స్థాయిలో తమ సొంత వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల ఓటర్లను ఆకర్షించడం ద్వారా భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని తిప్పికొడతామని అన్నారు. ఇది కేవలం పార్టీ వ్యూహం మాత్రమేనని, జాతీయ స్థాయిలో కూటమి ఎలా వ్యవహరించాలన్నది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.     

కేంద్రంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా 28 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పరస్పర సహకారం అందించుకోవాలని అన్ని పార్టీలు భావించాయి. అయితే, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఈ విషయంలో విభేదాలు తలెత్తాయి. అయితే, తొలుత ఎస్పీకి సీట్లు కేటాయించేందుకు నిరాకరించిన కాంగ్రెస్‌.. ఆ తర్వాత 6 స్థానాలను ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు 18 స్థానాల్లో రెండు పార్టీలూ తమ అభ్యర్థుల్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్‌ తమకు 6 స్థానాలు కేటాయించేందుకు అంగీకరించినా, అభ్యర్థులను ప్రకటించేటప్పుడు కనీసం సంప్రదించలేదని అఖిలేశ్‌ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పెద్దలు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అఖిలేశ్‌ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన అలక వీడినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని