UP Polls: యూపీలో ఆరోవిడత ఎన్నికలు.. మధ్యాహ్నానికి 36శాతం పోలింగ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.33శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 03 Mar 2022 14:44 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. 10 జిల్లాల పరిధిలో 57 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.33శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గోరఖ్‌పుర్‌ స్థానం నుంచి బరిలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ దశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (గోరఖ్‌పుర్‌ అర్బన్‌), రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ (తమ్‌కుహీ రాజ్‌), ఇటీవలే భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి మారిన స్వామిప్రసాద్‌ మౌర్య (ఫాజిల్‌నగర్‌) సహా మొత్తం 676 మంది అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పూర్వాంచల్‌లోని అంబేడ్కర్‌నగర్‌, బలరాంపుర్‌, సిద్ధార్థ్‌నగర్‌, బస్తీ, సంత్‌ కబీర్‌నగర్‌, మహారాజ్‌గంజ్‌, గోరఖ్‌పుర్‌, కుశీనగర్‌, దేవరియా, బలియా జిల్లాల పరిధిలో మొత్తం 57 అసెంబ్లీ స్థానాల్లో ఆరోవిడత పోలింగ్‌ జరుగుతోంది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో 46 సీట్లు భాజపా ఖాతాలోకి వెళ్లాయి.

గోరఖ్‌పుర్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సీఎం యోగిపై.. భాజపా దివంగత నేత ఉపేంద్ర శుక్లా సతీమణి శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ బరిలో దించింది. భీమ్‌ఆర్మీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నేడు జరుగుతోన్న ఆరో దశ పోలింగ్‌తో యూపీలో 349 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తవుతుంది. మిగతా 54 సీట్లకు ఈ నెల 7న చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని