హస్తం.. బెంగాల్‌కు దూరం దూరం

పశ్చిమ బెంగాల్‌.. యావత్‌ దేశం దృష్టంతా ఇప్పుడు ఈ రాష్ట్రంపైనే. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోనూ ఎన్నికల భేరీ మోగినప్పటికీ ‘బెంగాల్‌ దంగల్‌’పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది

Published : 03 Apr 2021 17:09 IST

ప్రచారంలో కానరాని అగ్రనేతలు

పశ్చిమ బెంగాల్‌.. యావత్‌ దేశం దృష్టంతా ఇప్పుడు ఈ రాష్ట్రంపైనే. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోనూ ఎన్నికల భేరీ మోగినప్పటికీ ‘బెంగాల్‌ దంగల్‌’పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్న ఇక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అలాంటి కీలక పోరులో. దశాబ్దాల ఘనచరిత కలిగిన కాంగ్రెస్‌ పార్టీ మచ్చుకు కూడా కన్పించట్లేదు. ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయినా ఇప్పటివరకు హస్తం పార్టీ అగ్రనేతలెవరూ ఇక్కడ ప్రచారం చేయకపోవడం ఆశ్చర్యకరం. బెంగాల్‌ పోరుకు కాంగ్రెస్‌ ఎందుకు దూరంగా ఉంటోంది..? దక్షిణాది రాష్ట్రాలపై అధిక దృష్టే కారణమా..? లేకా గెలుపు అంచనాలు లేకపోవడమా..?

కీలక నేతల లేమి..

పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు కాంగ్రెస్‌ బలంగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1962వరకు.. ఆ తర్వాత 1972 నుంచి 1977 వరకు అధికారంలో ఉంది. అనంతరం ప్రతిపక్ష హోదాలో ఉంది. అయితే 1999లో మమతాబెనర్జీ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో పార్టీ పెట్టడంతో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత నందిగ్రామ్‌ ఉద్యమం జరగడం, దీదీ అధికారంలోకి రావడం వంటి పరిణామాలతో రాష్ట్రంపై కాంగ్రెస్‌ పట్టు సడలిపోతూ వచ్చింది. దీంతో చాలా మంది హస్తం పార్టీ నేతలు టీఎంసీ గూటికి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ కూటములపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి సిద్దార్థ శంకర్‌ రాయ్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అగ్రనేతల మరణం బెంగాల్‌లో పార్టీకి తీరని లోటుగా మారింది.

ఆయన ఒక్కరే..

బెంగాల్‌లో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నేతలు అంతంతమాత్రంగానే ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌధరీ ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా తన లోక్‌సభ నియోజకవర్గంపైనే దృష్టిపెట్టి ఆ పరిధిలోనే ప్రచారం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ అయిన జితిన్‌ ప్రసాదా మాత్రం రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. మిగతా నేతలు అప్పుడప్పుడూ రాష్టంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రచార తారల జాబితాలో అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, పంజాబ్‌ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, అభిజిత్‌ ముఖర్జీ, మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ వంటి అగ్రనేతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వీరెవరూ ఇక్కడ ప్రచారానికి రాలేదు.

కూటమికి కష్టమే అని..

ఇక్కడ కాంగ్రెస్‌.. వామపక్షాలు, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కలిసి పొత్తు పెట్టుకుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా కేవలం 92 స్థానాల్లోనే హస్తం పోటీలో ఉంది. అయితే ఈసారి బెంగాల్‌ బరి.. ప్రధానంగా ‘దీదీ వర్సెస్‌ మోదీ’లాగే కన్పిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు లేకపోవడం వల్లే కాంగ్రెస్‌ దూరంగా ఉంటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కనీసం కూటమి అభ్యర్థుల తరఫున కూడా కాంగ్రెస్‌ ప్రచారం చేయట్లేదు. కీలకమైన నందిగ్రామ్‌లో వామపక్ష అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ప్రచారంలో కాంగ్రెస్‌ జెండాలు ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం.

ఆ రాష్ట్రాలపైనే అధిక దృష్టి..

మరోవైపు కాంగ్రెస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న కేరళ, పుదుచ్చేరి, అసోంతో పాటు తమిళనాడుకు ఏప్రిల్‌ 6న ఎన్నికలు పూర్తవనున్నాయి. దీంతో ముందు ఆ రాష్ట్రాలపైనే పార్టీ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడక ముందునుంచే రాహుల్‌ దక్షిణాదిలో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. ప్రియాంక గాంధీ కూడా అసోం, కేరళలో పలుమార్లు పర్యటించారు. అంతేగాక, కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 92 స్థానాల్లో అధిక స్థానాలకు చివరి విడతల్లో పోలింగ్‌ జరగనుంది. దీంతో ముందుగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం పూర్తి చేసి, బెంగాల్‌కు రావాలని అగ్రనేతలు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ

రాహుల్‌, ప్రియాంక వంటి నేతలు బెంగాల్‌లో ప్రచారం చేయకపోవడానికి మరో కారణం లేకపోలేదు. ఈ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. కేరళలో వారితో ప్రత్యర్థిగా తలపడుతోంది. అందుకే అక్కడ ఎన్నికలు పూర్తయ్యేవరకు వామపక్షాలకు దూరంగా ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికల్లో సెక్యులర్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకోవడం కూడా పార్టీ రాష్ట్రవర్గంలో విభేదాలకు కారణమైంది. 

మరి ఏప్రిల్‌ 6 తర్వాత అయినా కాంగ్రెస్‌ అగ్రనేతలు బెంగాల్‌ బరిలోకి దిగుతారో లేదో చూడాలి..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని