YSRCP: తీవ్ర అసహనం.. పీఏ చెంప చెళ్లుమనిపించిన వైకాపా ఎమ్మెల్యే

తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై వైకాపా ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 01 May 2023 12:26 IST

అచ్యుతాపురం: తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై వైకాపా ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్‌నాథ్‌ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్‌ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్‌ నినాదాలు చేశారు.

సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా..  పీఏ నవీన్‌వర్మ ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప చెళ్లుమనిపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో సొంతపార్టీ నేతల నిరసనల మధ్యే కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.

గతంలోనూ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన..

గతంలో తనకు విద్యాదీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. కొద్దిరోజుల క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో ‘గడప గడపకు’ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. మళ్ల శంకర్‌ అనే వ్యక్తి ఇంటి వద్దకెళ్లి ఆయన కుమార్తెను అమ్మఒడి పథకం అందిందామ్మా? అని ప్రశ్నించారు. అందిందని ఆమె తెలిపింది.

తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన మంజూరు కాలేదని శంకర్‌ కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకు తెలిపాడు. నువ్వు చదువుకున్న పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడమెందుకని యువకుడు ఎదురు ప్రశ్నవేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్నవేస్తావా? ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మళ్లీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు సమాధానం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘ఎవరితో మాట్లాడుతున్నావ్‌. పళ్లు పీకేస్తా’అంటూ విద్యార్థిపైకి దూసుకువెళ్లారు. ఎమ్మెల్యే ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని