మళ్లీ అంబటి రుసరుస...!

పోలవరం ప్రాజెక్టులో నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదా

Published : 23 May 2022 10:07 IST

పోలవరం నిర్ణయాలకు కేంద్రం   ఆమోదం ఉందా లేదా?
 సమాధానం చెప్పని మంత్రి

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పని మంత్రి అంబటి రాంబాబు మళ్లీ ‘ఈనాడు’, ‘ఈటీవీ’ విలేకరులపై రుసరుసలాడారు. పోలవరంలో ఆదివారం డిజైన్లపై కేంద్ర నిపుణులు, ముఖ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారు. ఈ పరిస్థితికి పాత ప్రభుత్వమే కారణమని విమర్శలు చేస్తూ ‘ఈనాడు’ విలేకరి ఉన్నారా...సొంతంగా విశ్లేషణలు చేస్తున్నారు కదా...ఎవరి వైఫల్యమో రాస్తున్నారు కదా అంటూ చిర్రుబుర్రులాడారు. ఆయనతో ఆ సమయంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఉన్నారు. పాత ప్రభుత్వంపై అంబటి ఏ విమర్శలు చేస్తున్నారో, ఆ నిర్ణయాలు అమలు చేసిన సమయంలో శశిభూషణ్‌ కుమారే జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ నిర్ణయాలకు జలవనరుల శాఖ కార్యదర్శి ఏం సమాధానం చెబుతారు అని ‘ఈనాడు’ ప్రశ్నించగా అంబటి అసహనం వ్యక్తం చేశారు. ‘కార్యదర్శి ఏమంటారు. ఈఎన్‌సీ ఏమంటారు... పోలవరం సీఈ ఏమంటారు అని అడుగుతావేంటి...నన్ను అడుగు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాత్రం స్పందించలేదు. మంత్రి రాజకీయ విమర్శలు చేస్తున్నా ఉన్నతాధికారులు ఇద్దరూ నవ్వుతూ కూర్చోవడం విశేషం. ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోయాయ్‌ అని రాశారు. ఒంటిమిట్టలో బాగానే పని చేస్తోంది. అది మీరు రాయరే అని ప్రశ్నించారు. ఒంటిమిట్టలో ఎత్తిపోతల పథకమూ పని చేయడం లేదు...మేం రాసింది వాస్తవమే అని చెప్పినా వినకుండా   విమర్శలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం

పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తామన్నది ప్రస్తుత పరిస్థితుల్లో గడువు చెప్పలేమన్నారు. ప్రస్తుతం అగాధాలను ఎలా పూడ్చాలి?. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను ఏం చేయాలో చర్చిస్తున్నామన్నారు. తాము మరో తప్పిదం చేయదలుచుకోలేదని చెప్పారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారం కనుగొన్న తర్వాత అప్పుడు గడువు నిర్ణయిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం పూర్తి చేస్తామని అంబటి రాంబాబు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని