రూ.800 కోట్లు ఎటు మళ్లించారో చెప్పాలి

‘‘ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ సొమ్మును వారికి తెలియకుండానే ప్రభుత్వం మాయం చేయడం విస్మయం కలిగిస్తోంది. ఉద్యోగులకు తెలియకుండానే డబ్బులు తీసుకోవడం

Published : 30 Jun 2022 05:50 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ సొమ్మును వారికి తెలియకుండానే ప్రభుత్వం మాయం చేయడం విస్మయం కలిగిస్తోంది. ఉద్యోగులకు తెలియకుండానే డబ్బులు తీసుకోవడం అంటే వారిని మోసం చేయడమే. ఈ రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎం సమాధానం చెప్పాలి’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘వైకాపా ప్రభుత్వ పెద్దలు సూట్‌కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్‌ కళ్లకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ములూ మాయం చేశారు. జీపీఎఫ్‌ ఖాతాలోని సొమ్ములను డ్రా చేసుకునే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఆ నిధికి కస్టోడియన్‌ మాత్రమే. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా? వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా పెండింగులో ఉంచుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు తెలియకుండానే ఆ డబ్బులు తీసుకుందంటే ఇక ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ ఉన్నట్లు’’ అని నాదెండ్ల నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని