పోలీసులకు సైబర్‌ పాఠాలు

క్రిప్టో కరెన్సీ.. బిట్‌ కాయిన్‌ల క్రయవిక్రయాల పేరుతో బాధితుల నుంచి రూ.కోట్లు కొట్టేస్తున్న సైబర్‌ నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రముఖ ఐటీ సంస్థలు, సైబర్‌ నిపుణుల నుంచి స్వల్పకాలిక శిక్షణ

Published : 19 May 2022 05:21 IST

క్రిప్టో నేరాలను అరికట్టేందుకు స్వల్పకాలిక శిక్షణ
మూడు నెలల్లో 15 శాతం తగ్గించాలని లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: క్రిప్టో కరెన్సీ.. బిట్‌ కాయిన్‌ల క్రయవిక్రయాల పేరుతో బాధితుల నుంచి రూ.కోట్లు కొట్టేస్తున్న సైబర్‌ నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రముఖ ఐటీ సంస్థలు, సైబర్‌ నిపుణుల నుంచి స్వల్పకాలిక శిక్షణ తీసుకుంటున్నారు.హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో సైబర్‌ నేరస్థులు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రూ.22 కోట్లకుపైగా కాజేశారు. పోలీసులు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఒకరిద్దరిని మాత్రమే గుర్తించగలుగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పోలీస్‌ అధికారులకు అవగాహన ఉన్నా.. సైబర్‌ నేరస్థులు సొంతంగా తయారుచేసుకుంటున్న యాప్‌లు, క్రిప్టో కరెన్సీ సంబంధిత సాంకేతిక అంశాలపై అంతగా పట్టు లేదు. వారి నేర శైలిని మరింతగా తెలుసుకునేందుకు, బాధితుల నుంచి నగదు కొట్టేశాక నేరస్థులు వాటిని విత్‌డ్రా చేసుకుంటున్న తీరును గుర్తించడానికి  పోలీస్‌ అధికారులు ఐటీ సంస్థలు.. సైబర్‌ నిపుణులను సంప్రదించారు. వారి వినతి మేరకు మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థ ఇటీవలే సైబర్‌ క్రైమ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చింది. కాగా  నిందితులను పట్టుకోవడంతో పాటు మూడు నెలల్లో 15 శాతం నేరాలను తగ్గించాలని పోలీసులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

మోసాలిలా జరుగుతున్నాయ్‌..!

బిట్‌ కాయిన్లు కొన్నా, అమ్మినా.. రోజుకు రూ.వేలల్లో  లాభం వస్తుందని సైబర్‌ నేరస్థులు బాధితులను నమ్మిస్తున్నారు. మదుపు చేసిన సొమ్ములో నెలకు 15 శాతం నుంచి 25 శాతం వరకు లాభం వస్తుందని చెబుతున్నారు.

నిందితుల మాటలు నమ్మి బిట్‌ కాయిన్లు కొన్న బాధితులకు తొలుత లాభాలు ఇస్తున్నారు. తర్వాత బిట్‌ కాయిన్ల నిర్వహణకు డీమ్యాట్‌ ఖాతా తరహాలో ఒక యాప్‌ ఉందని, అందులో ఖాతా తెరవాలని సూచిస్తున్నారు. ఖాతా తెరిచాక రోజువారీ లాభం, బాధితులు మళ్లీ మదుపు చేసిన వివరాలన్నీ యాప్‌లో ఉంటాయి.

తొలుత నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించినా.. తరువాత సైబర్‌ నేరస్థులు తమ వద్దే ఆ అధికారాన్ని ఉంచుకుంటారు. లాభాలు తీసుకోవాలనుకుంటే మళ్లీమళ్లీ మదుపు చేయాలంటూ చెబుతున్నారు.

బాధితుల వద్ద డబ్బుల్లేవని నిర్ధారించుకున్నాక వారికి కేటాయించిన యాప్‌ కనిపించకుండా చేస్తున్నారు. సైబర్‌ నేరస్థుల మాటలు నమ్మి సికింద్రాబాద్‌లో ఉంటున్న ఒక వ్యాపారి కొద్దిరోజుల్లోనే రూ.27 లక్షలు నష్టపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని