సకల కళల మూర్తీభవనం

ఈ ఏడాది నిర్మాణం పూర్తికానున్న కొత్త పార్లమెంటు భవనం ఎన్నో విశేషాలకు నిలయంగా మారనుంది. త్రికోణాకృతిలో ఉండి దేశ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాలను ప్రతిబింబిస్తుంది. భవనం లోపల అలంకరించాల్సిన చిత్రపటాలు, శిల్పాలు,

Published : 01 Jul 2022 06:34 IST

 కొత్త పార్లమెంటులో ఎన్నో విశేషాలు

దిల్లీ: ఈ ఏడాది నిర్మాణం పూర్తికానున్న కొత్త పార్లమెంటు భవనం ఎన్నో విశేషాలకు నిలయంగా మారనుంది. త్రికోణాకృతిలో ఉండి దేశ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాలను ప్రతిబింబిస్తుంది. భవనం లోపల అలంకరించాల్సిన చిత్రపటాలు, శిల్పాలు, కుడ్య చిత్రాలు, శిలా శాసనాలను ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర సాంస్కృతిక శాఖ మూడు ప్రత్యేక కమిటీలకు అప్పగించింది. ఆ బృందాలలో విద్యావేత్తలు, చరిత్రకారులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, కేంద్ర పట్టణాభివృద్ది, సాంస్కృతిక శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మూడు బృందాలలో ఒకటి కొత్త భవనంలో ఏయే కళావస్తువులను నెలకొల్పాలనే దానిపై పరిశోధన చేసి సిఫార్సులు సమర్పిస్తుంది. భవనం ముంగిట ప్రతిష్ఠించాల్సిన విగ్రహాన్ని ఎంపిక చేస్తుంది. భారత రాజ్యాంగ నకలు ప్రతితో రాజ్యాంగ గ్యాలరీని ఏర్పాటుచేస్తారు. భారత సంస్కృతికి అద్దంపట్టే గ్యాలరీలూ ఉంటాయి. రెండో కమిటీకి కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, మూడో కమిటీకి ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం సభ్య కార్యదర్శి సచ్చిదానంద జోషీ అధ్యక్షత వహిస్తారు. మోహన్‌ బృందంలో సాంస్కృతిక శాఖ అధికారులతోపాటు భరతనాట్యం కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, పురాతత్వవేత్త కె.కె.మహమ్మద్‌, ప్రసార భారతి మాజీ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ సభ్యులుగా ఉంటారు. జోషీ నాయకత్వంలోని కమిటీ కొత్త భవనంలో కళాఖండాల అమరికను పర్యవేక్షిస్తుంది. కొత్త పార్లమెంటు భవనం దేశ ప్రజల మత విశ్వాసాలకు కూడా సముచిత స్థానం కల్పిస్తుంది. కళలతో పాటు వేదాలు, యోగ, ఉపనిషత్తులు, సూఫీ, కబీర్‌ పథాలు, జానపద సంస్కృతీ సంపదాయాలు- ఇవన్నీ కొత్త భవనం లోపల ప్రతిఫలిస్తాయని ఓ సభ్యుడు చెప్పారు. జాతీయ చిహ్నాలైన పద్మం, నెమలి, వటవృక్షం అలంకృతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని