Published : 07 Jul 2022 06:20 IST

అమెరికా నేరాలకు ఎవరు జవాబుదారీ?

 అగ్రరాజ్యాన్ని ప్రశ్నించిన రష్యా

అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు పెద్దన్న మద్దతుపై మండిపాటు

మాస్కో: ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన చర్య మీద అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసేలా సాయపడాలని అమెరికా ప్రయత్నిస్తే ‘‘దైవాగ్రహాన్ని’’ చవిచూడాల్సి వస్తుందని అమెరికాకు రష్యా హెచ్చరించింది. యుద్ధనేరాల న్యాయస్థానం కోసం ఒత్తిడి తెస్తే తీవ్ర చర్యలు తప్పవంది. అంతటా భయాందోళనలు రేకెత్తించి, ప్రపంచ నాశనం కోసమే అగ్రరాజ్యం ఇలాంటి ప్రయత్నం చేస్తోందని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు, దేశ మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ ఆరోపించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అమెరికా చరిత్ర పరికిస్తే మొత్తం అంతా రక్తపాత యుద్ధాలే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌పై వేసిన అణుబాంబులు, వియత్నాంపై చేసిన యుద్ధం వంటి నేరాలకు ఎవరినైనా బాధ్యుల్ని చేశారా? అక్కడ అమెరికా ప్రవహింపజేసిన రక్త సముద్రాలను ఏ ట్రైబ్యునల్‌ ఖండించింది?’’ అని ప్రశ్నించారు. అమెరికా ఎలాంటి విచారణలు ఎదుర్కొనేందుకు సిద్ధపడకుండా ఇతరులపై మాత్రం తీర్పులకు తయారైపోతుందని విమర్శించారు. ఇది రష్యా విషయంలో పనిచేయదనీ, ఈ విషయం అమెరికాకూ తెలుసునని అన్నారు. అణ్వాయుధాల పరంగా బలంగా ఉన్న దేశాన్ని శిక్షించాలనుకోవడం అవివేకమనీ, మానవాళి మనుగడకే అది ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ఒకప్పుడు అలాస్కా కూడా రష్యా ఆధీనంలోనే ఉండేదన్న విషయాన్ని అమెరికా గుర్తు తెచ్చుకోవాలని రష్యా దిగువ సభ స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వొలొదిన్‌ చెప్పారు.

యుద్ధంలో 12 మంది పౌరుల మృతి

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఒకరోజు వ్యవధిలో 12 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దొనెట్స్క్‌లో ఇప్పటికీ మిగిలిన 3.5 లక్షల మంది ప్రజలు ఇతర చోట్లకు తరలిపోవాలని గవర్నర్‌ పావ్లో కిరిలెంకో సూచించారు. ఉక్రెయిన్‌ చేసిన ఎదురుదాడుల్లో నలుగురు ప్రజలు చనిపోయారని రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రకటించారు. 

100 మంది సైనికుల్ని చంపేశాం: రష్యా

ఉక్రెయిన్‌కు చెందిన మరో 100 మంది వరకు సైనికుల్ని ఖర్కివ్‌లో చంపేశామనీ, నాలుగు సాయుధ వాహనాలనూ నాశనం చేశామనీ రష్యా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన రెండు ‘హిమార్స్‌’ రాకెట్‌ వ్యవస్థల్ని కూడా గగనతల దాడుల ద్వారా ధ్వంసం చేశామని వెల్లడించింది.

మా వ్యవస్థల్ని రష్యా హ్యాక్‌ చేసింది: పోలండ్‌

ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా నిలుస్తున్నామన్న ఉక్రోషంతో రష్యా తమ ప్రభుత్వ వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి, ఈ-మెయిళ్లను లీక్‌ చేస్తోందని పోలండ్‌ ప్రధాని మటియూజ్‌ మొరావియెకి ఆరోపించారు. రష్యాతో పాటు బెలారస్‌ గూఢచర్య సంస్థలకు దీనితో ప్రమేయం ఉందని చెప్పారు.


రష్యా సహజవాయువుతో తస్మాత్‌ జాగ్రత్త: ఈయూ అధిపతి ఉర్సులా

బ్రసెల్స్‌: ఐరోపాకు.. రష్యా ఏ సమయంలోనైనా సహజవాయువు ఎగుమతులు ఆపేయనుందా...? అంటే అవుననే అంటున్నారు. ఐరోపా సమాఖ్య(ఈయూ) అధిపతి ఉర్సులా వాన్‌డెర్‌ లియెన్‌. ఈ ప్రమాదాన్ని ముందుగా అంచనా వేసి, అందుకు తగ్గ అత్యవసర చర్యలు ఐరోపా తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాఖ్యలోని 27 దేశాలను ఆమె బుధవారం హెచ్చరించారు. ‘‘పుతిన్‌.. ఇంధనాన్ని ఆయుధంగా వాడుతున్నారు. ఏ సమయంలోనైనా ఆ దేశం నుంచి సహజవాయువు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కొవటానికి అందరూ సమైక్యంగా పనిచేయాలి’’ అని ఆమె అన్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని