కొవిడ్‌ను 20 నిమిషాల్లో పట్టేయవచ్చు..చౌకైన, స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పరీక్ష సిద్ధం

కొవిడ్‌-19ను పసిగట్టే చౌకైన, స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Published : 26 Jan 2022 10:54 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19ను పసిగట్టే చౌకైన, స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులో యాంటిజెన్‌ పరీక్షల్లో ఉండే వేగం, పీసీఆర్‌ పరీక్షల్లో కనిపించే కచ్చితత్వం ఉంటాయి. ఈ సాధనానికి ‘ద హార్మనీ కొవిడ్‌-19’ పరీక్ష అని పేరు పెట్టారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. హార్మనీ కిట్‌ ద్వారా 20 నిమిషాల్లోపే కొవిడ్‌ పరీక్షను పూర్తి చేయవచ్చు. ‘‘తక్కువ ఖర్చుతో ఎక్కడైనా చేయగలిగేలా ఈ పరీక్షను రూపొందించాం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తృతంగా అందుబాటులోకి రావడానికి వీలవుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బారీ లట్జ్‌ తెలిపారు. పీసీఆర్‌ పరీక్ష తరహాలో ఈ విధానం కూడా రోగి నుంచి సేకరించిన స్వాబ్‌లో కరోనా వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏ జీనోమ్‌ను పసిగడుతుంది. ఇందుకోసం చిన్నపాటి, చౌకైన డిటెక్టర్‌ను వాడారు. దీని నిర్వహణకు, ఫలితాన్ని విశ్లేషించడానికి స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించారు. ఈ డిటెక్టర్‌ ఏకకాలంలో నాలుగు నమూనాలను పరిశీలించగలదు. ఇళ్లలోనే నిర్వహించగల అనేక యాంటిజెన్‌ కిట్లు 80-85 శాతం కచ్చితత్వాన్ని మాత్రమే కలిగి ఉంటున్నాయి. అవి వైరస్‌లోని జన్యు పదార్థాన్ని కాకుండా ప్రొటీన్‌ భాగాలను గుర్తించడమే ఇందుకు కారణం. పీసీఆర్‌ పరీక్షలు మాత్రం 95 శాతం కన్నా ఎక్కువ కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఫలితం కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తుంది. ‘హార్మనీ’ కిట్‌ మాత్రం ముక్కు నుంచి సేకరించే స్వాబ్‌ నమూనాల విషయంలో 97 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని