ఉమ్మడి కుటుంబంలో కోడలికి ఆ హక్కేమీ ఉండదు!

గృహహింస చట్టం కింద.. ఉమ్మడి కుటుంబంలో కోడలికి అజేయమైన నివాస హక్కేమీ ఉండదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వయోధికులైన అత్తమామలు శాంతియుతంగా

Updated : 03 Mar 2022 11:38 IST

అత్తవారింటిలో నివాసంపై దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: గృహహింస చట్టం కింద.. ఉమ్మడి కుటుంబంలో కోడలికి అజేయమైన నివాస హక్కేమీ ఉండదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వయోధికులైన అత్తమామలు శాంతియుతంగా జీవించడానికి గాను వారి అభీష్టం మేరకు ఆమె ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొంది. భార్యతో విభేదాల వల్ల తన కుమారుడు వేరే ఇంటిలో ఉంటున్న నేపథ్యంలో.. కోడలు తన స్వార్జితమైన ఇంటిని ఖాళీ చేయాలంటూ ఆమె మామ 2016లో ఓ విచారణ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈమేరకు అత్తవారింటిలో ఆమె నివసించే హక్కును నిరాకరిస్తూ విచారణ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆ కోడలు దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె వ్యాజ్యాన్ని హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఉమ్మడి కుటుంబానికి సంబంధించి కోడలిని ఖాళీ చేయమని చెప్పడానికి.. ఆస్తికి యజమానులైన వారిపై ఎలాంటి నిషేధం ఉండదని ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ యోగేశ్‌ ఖన్నా స్పష్టం చేశారు. అయితే తన కుమారుడు-కోడలి వివాహం చెల్లుబాటులో ఉన్నంతవరకు ఆమెకు ప్రత్యామ్నాయ నివాసం కల్పిస్తానని ఆమె మామ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుంటూ.. అది సముచితమేనని పేర్కొన్నారు. ఈ కేసులో సీనియర్‌ సిటిజన్లు అయిన అత్తమామలు శాంతియుత జీవనం సాగించే యోగ్యత కలవారని, కుమారుడు-కోడలు మధ్య గొడవలు వారిని బాధించరాదని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని