Food Crisis: అటు కరోనా ఇటు యుద్ధం.. పెరిగిన ఆకలి కేకలు

ప్రపంచంలో ఆహార కొరతను ఎదుర్కొనే ప్రజల సంఖ్య మరింత పెరగనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

Published : 05 May 2022 10:39 IST

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో ముదిరిన ప్రపంచ ఆహార సంక్షోభం
ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి

రోమ్‌: ప్రపంచంలో ఆహార కొరతను ఎదుర్కొనే ప్రజల సంఖ్య మరింత పెరగనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా నిరుడు పెరిగిపోయిందని తెలిపింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఈ పరిస్థితి మరింత విషమించనున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సాయుధ సంఘర్షణలు, వాతావరణ వైపరీత్యాలు, కరోనా వైరస్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం వల్ల 2021లో 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతకు లోనయ్యారని బుధవారం వెలువడిన ఐరాస నివేదిక పేర్కొంది. వీరిలో 4 కోట్ల మంది గత ఏడాదే అన్నార్తుల జాబితాలో కొత్తగా చేరారని వివరించింది. క్షుద్బాధకు లోనవుతున్న వారి సంఖ్య ప్రతియేటా పెరిగిపోతూనే ఉందని విశ్లేషించింది. అంతర్జాతీయ ఆహార సంక్షోభంపై ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ, ఐరోపా సమాఖ్య (ఈయూ) సంయుక్తంగా వెలువరించిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.

ఆఫ్రికా దేశాల్లో ప్రమాద ఘంటికలు

నిత్య సంఘర్షణలకు ఆలవాలమైన అఫ్గానిస్థాన్, కాంగో, ఇథియోపియా, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్‌ దేశాల ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. సోమాలియాలో తీవ్ర అనావృష్టి, ద్రవ్యోల్బణం, సాయుధ సంఘర్షణలు కొనసాగుతున్నందున ఈ ఏడాది 60 లక్షల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవచ్చని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు గోధుమలు, వంట నూనెలు, ఎరువుల కోసం ఉక్రెయిన్, రష్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలూ యుద్ధంలో మునిగిపోయినందున సోమాలియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలను ఆహార సంక్షోభం చుట్టుముట్టనున్నది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టాలనీ, రాబోయే పంట సీజనులో సంక్షుభిత ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవడానికి సుమారు రూ.11,450 కోట్లు (అమెరికన్‌ డాలర్లలో 150 కోట్లు) కేటాయించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని