మా ప్రథమ శత్రువు రష్యానే

రష్యాను తమ ప్రథమ శత్రువుగా నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ప్రకటించింది. ఆ దేశంతోనే తమ భాగస్వామ్య దేశాలకు నేరుగా ముప్పు ఉందని స్పష్టంచేసింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌,

Published : 30 Jun 2022 06:18 IST

ఆ దేశంతోనే మాకు నేరుగా ముప్పు
30 దేశాల నాటో కూటమి ప్రకటన
డిక్లరేషన్‌లో చైనా పేరూ ప్రస్తావన

మాద్రీద్‌: రష్యాను తమ ప్రథమ శత్రువుగా నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ప్రకటించింది. ఆ దేశంతోనే తమ భాగస్వామ్య దేశాలకు నేరుగా ముప్పు ఉందని స్పష్టంచేసింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సహా 30 మంది దేశాధినేతలు.. మాద్రీద్‌ లో జరిగిన నాటో సదస్సులో రానున్న పదేళ్ల కోసం వ్యూహాత్మక విధాన ప్రకటన విడుదల చేశారు. ఇందులో రష్యాతో ముప్పునే ప్రధానంగా ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయమేంటంటే 2010లో విడుదల చేసిన డిక్లరేషన్‌లో రష్యాను భాగస్వామి దేశంగా నాటో పేర్కొంది. ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్యతో ఈ సమీకరణాలు మారిపోయాయి. రష్యాతో తాము స్పర్థను కోరుకోవడం లేదని, అయితే ఆ దేశ బెదిరింపులకు దీటుగా సమాధానం చెబుతామని కూటమి దేశాలు మాద్రీద్‌లో తీవ్రంగా హెచ్చరించాయి. ఈ సదస్సుకు ఆతిథ్య దేశాలుగా జపాన్‌, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ హాజరయ్యాయి. వ్యూహాత్మక విధాన ప్రకటనలో రష్యాతో పాటు చైనా ప్రస్తావనా ఉంది. చైనా లక్ష్యాలు, విధానాలు తమ భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని నాటో పేర్కొంది.

నాటోలోకి స్వీడన్‌, ఫిన్లాండ్‌!

ఫిన్లాండ్‌, స్వీడన్‌లకు నాటో కూటమిలోకి చేరడానికి అడ్డంకులు దాదాపు పోయినట్లే. ఇప్పటివరకు ఈ రెండు దేశాల చేరికకు అభ్యంతరం చెబుతూ వచ్చిన తుర్కియే (టర్కీ).. ఎట్టకేలకు తన అంగీకారాన్ని తెలిపింది. ఈ మేరకు మూడు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఫిన్లాండ్‌, స్వీడన్‌ను నాటో.. లాంఛనంగా కూటమిలోకి ఆహ్వానించింది. ఈ పరిణామాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. తమకూ సభ్యత్వమివ్వాలని, తామెంత కాలమింకా వేచి ఉండాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెలెన్‌స్కీ నాటో సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాను ఓడించడానికి తమకు మరిన్ని ఆయుధాలు కావాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఆయుధాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో నాటో కూటమికి, రష్యాకు మధ్య యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘‘రష్యా.. మిమ్మల్ని, మమ్మల్ని నాశనం చేయకుండా ఉండేందుకు మేం పోరాడుతున్నాం’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు నాటో కూటమి ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. యుద్ధం ఎంతకాలం కొనసాగినా అన్ని రకాలుగా సాయం చేస్తూనే ఉంటామని తెలిపింది.

ఇక ఐరోపాకు భారీగా బలగాలు

రష్యాను ప్రథమ శత్రువుగా ప్రకటించిన నాటో.. ఇక ఐరోపాలో భారీగా బలగాలను మోహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సదస్సు ఆరంభ ఉపన్యాసంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. పోలండ్‌లో శాశ్వత అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యూకేకు రెండు అదనపు ఎఫ్‌-35 స్వ్కాడ్రన్‌ దళాలను పంపుతామని, త్వరలో జర్మనీ, ఇటలీల్లో వైమానిక రక్షణ దళాలను మోహరిస్తామని పేర్కొన్నారు. నాటో సెక్రటరీ జనరల్‌ స్టొల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదురైన అతి పెద్ద సైనిక సవాలుగా అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని