మనీవార్‌: ఏ సీజన్‌లో ఎవరెవరు?

ఐపీఎల్‌.. లీగ్‌లకు రారాజు‌. అనూహ్య ఘట్టాలకు ప్రధాన వేదిక. అది మైదానంలో పోరైనా, ఆటగాళ్ల వేలంలోనైనా. అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్రాంచైజీలు ‘మనీవార్‌’లో నచ్చిన ప్లేయర్లను భారీధర వెచ్చించి సొంతం చేసుకోవడం ఇక్కడ కొత్తేమీ కాదు...

Updated : 23 Apr 2021 16:22 IST

భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే..

ఐపీఎల్‌.. లీగ్‌లకు రారాజు‌. అనూహ్య ఘట్టాలకు ప్రధాన వేదిక. అది మైదానంలో పోరైనా, ఆటగాళ్ల వేలంలోనైనా. అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్రాంఛైజీలు ‘మనీవార్‌’లో నచ్చిన ప్లేయర్లను భారీధర వెచ్చించి సొంతం చేసుకోవడం ఇక్కడ కొత్తేమీ కాదు. అందుకే రెండు మూడేళ్లకొకసారి వేలంలో రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది రూ.కోట్లను దక్కించుకొని వేలంలో టాప్‌గా నిలిచిన ఆటగాళ్ల గురించి ఓ లుక్‌ వేద్దాం.

మహీతో మొదలైంది

ప్రతి ఫ్రాంచైజీ కోరుకునే ఆటగాడు ఎంఎస్ ధోనీ. చురుకైన బుర్రతో, పదునైన బ్యాటింగ్‌తో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంటాడు. అందుకే తొలి సీజన్‌ నుంచే మహీ కోసం ఫ్రాంఛైజీలు విపరీతంగా పోటీపడ్డాయి. 2008 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని 9.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో అతడు 16 మ్యాచ్‌ల్లో 133 స్ట్రైక్‌రేట్‌, 41 సగటుతో 414 పరుగులు చేశాడు.


ఆంగ్లేయుల హవా

2009 వేలంలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఫ్లింటాఫ్‌, కెవిన్‌ పీటర్సన్‌కు కాసుల పంట దక్కింది. వీరిద్దరు రూ.9.8 కోట్ల (దాదాపు) ధర పలికారు. ఫ్లింటాఫ్‌ను చెన్నై, పీటర్సన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దక్కించుకుంది. అయితే ఫ్లింటాఫ్‌ గాయంతో సీజన్‌ మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 62 పరుగులు, రెండు వికెట్లే తీసి నిరాశపరిచాడు. మరోవైపు పీటర్సన్‌ ఆరు మ్యాచ్‌ల్లో 15 సగటుతో 93 పరుగులు చేసి విఫలమయ్యాడు.


పొలార్డ్‌కు డిమాండ్‌

2010 వేలంలో బౌలర్లు‌, ఆల్‌రౌండర్లకు డిమాండ్ పెరిగింది. న్యూజిలాండ్ పేసర్‌ షేన్‌ బాండ్‌ను రూ.4.8 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. అతడు 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లే తీసినప్పటికీ పొదుపుగా (ఎకానమీ రేటు 7.22) బౌలింగ్ చేశాడు. అదే ధరకి ముంబయి ఇండియన్స్‌ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్ పొలార్డ్‌ను దక్కించుకుంది. అతడు ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటాడు. 15 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో పాటు 185 స్ట్రైక్‌రేట్ తో 273 పరుగులు చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోవైపు ఫినిషర్‌గా అదరగొట్టాడు.


గంభీర్‌కు జాక్‌పాట్‌

2010 సీజన్‌లో రాణించిన గౌతం గంభీర్‌ 2011-వేలంలో రికార్డు ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ.14.9 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్‌లో అతడు 15 మ్యాచ్‌ల్లో 34.36 సగటుతో 378 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 119.


జడేజాకు జైకొట్టారు

2012 వేలంలోనూ మరో భారత ఆటగాడికి భారీ సొమ్ము దక్కింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను చెన్నై రూ.12.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 126 స్ట్రైక్‌రేట్‌తో 191 పరుగులు; 7.80 ఎకానమీ రేటుతో 12 వికెట్లు సాధించాడు.


ముంబయికి మాక్సీ

2013 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు ముంబయి రూ.6.3 కోట్లు (దాదాపు) వెచ్చించింది. అయితే అతడు ఎంతో నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులే చేశాడు.


యువ‘రాజు’

సిక్సర్ల రారాజు యువరాజ్‌ సింగ్‌కు 2014-సీజన్‌ వేలంలో భారీ ధర పలికాడు. బెంగళూరు అతడిని రూ.14 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. యువీ 14 మ్యాచ్‌ల్లో 34.18 సగటు, 135.25 స్ట్రైక్‌రేట్‌తో 376 పరుగులు చేశాడు. అయిదు వికెట్లూ పడగొట్టాడు. అయితే తర్వాత సీజన్‌ వేలంలో యువరాజ్‌ చరిత్ర సృష్టించాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడి కోసం రూ.16 కోట్లు గుమ్మరించింది. లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువీ నిలిచాడు. కాగా, 2015 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 248 పరుగులే చేశాడు. ఒక వికెట్‌ పడగొట్టాడు.


వారెవ్వా వాట్సన్‌

2016 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ను బెంగళూరు రూ.9.5 కోట్లకు తీసుకుంది. అయితే బ్యాటుతో ఘోరంగా విఫలమైన అతడు బంతితో సత్తాచాటాడు. అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్‌ 179 పరుగులు, 20 వికెట్లు తీశాడు.


వేలంలో స్టోక్స్‌ స్ట్రోక్ ప్లే‌..

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ వరుసగా 2017, 2018 సీజన్‌ వేలాల్లో అత్యధిక ధరను దక్కించకున్నాడు. రూ.14.5 కోట్లకు రైజింగ్ పుణె సూపర్‌జైంట్‌; రూ.12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌ వరుసగా దక్కించుకున్నాయి. 2017లో పుణె తరఫున 12 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. 12 వికెట్లు తీసి ఓ శతకాన్ని కూడా బాదాడు. అయితే 2018లో 13 మ్యాచ్‌లు ఆడిన 16 సగటుతో 196 పరుగులే చేశాడు. ఎనిమిది వికెట్లు తీశాడు.


రేటు సూపర్‌.. ప్రదర్శన పేలవం

2019 సీజన్‌ వేలంలో పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి భారీ డిమాండ్‌ దక్కింది. ఉనద్కత్‌ను రాజస్థాన్, వరుణ్‌ను పంజాబ్‌ రూ.8.4 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే ఉనద్కత్‌ 11 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. 10.66 ఎకానమీతో పరుగులిచ్చి నిరాశపరిచాడు. మరోవైపు ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న వరుణ్‌ ఒక వికెట్ తీశాడు. 11.66 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.


కమిన్స్‌ కమాల్‌.. మోరిస్‌కు మోర్‌ మనీ

2020 వేలంలో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ రూ.15.5 కోట్ల భారీ ధర పలికాడు. అతడిని కోల్‌కతా సొంతం చేసుకుంది. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 7.86 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. 128 స్ట్రైక్‌రేట్‌తో 146 పరుగులు చేశాడు. ఇక గురువారం జరిగిన 2021 వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లు దక్కించుకుని రికార్డు బద్దలుకొట్టాడు. లీగ్‌ వేలం చరిత్రలోనే అత్యధిక సొమ్ము సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. మరి ఈ సీజన్‌లో మోరిస్‌ ప్రదర్శన చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని