Ashwin: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. ఆసీస్‌ టాస్‌ వెనుక అసలు ప్లాన్‌ ఇదీ: అశ్విన్‌

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌లో టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, దీనికిగల కారణాలను తాజాగా అశ్విన్‌ బయటపడ్డాడు.

Updated : 24 Nov 2023 09:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (ODI World Cup 2023) ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌ వేదిక భారత్‌కు (IND vs AUS) కలిసిరాలేదు. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, దీని వెనుక ఉన్న కారణమేంటనేది తాజాగా భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) విశ్లేషించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ సందర్భంగా ఆసీస్ చీఫ్‌ సెలక్టర్ జార్జ్‌ బెయిలీని ఇదే విషయంపై అడిగితే విస్తుపోయేలా సమాధానం ఇచ్చాడని అశ్విన్‌ తెలిపాడు. 

‘‘ఆసీస్‌ నిర్ణయం నన్ను వ్యక్తిగతంగానూ ప్రభావితం చేసింది. ఎందుకంటే నేను ఇన్నింగ్స్‌ మధ్యలో పిచ్‌ను పరిశీలించా.  ఆ తర్వాత జార్జ్‌ బెయిలీని కలిశా. మీరు టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకుంటామని చెప్పారు? కదా అలా ఎందుకు చేయలేదు? అని అడిగా. దానికి ఇచ్చిన సమాధానం మాత్రం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘మేం ఇక్కడ ఐపీఎల్‌, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాం. సాధారణంగా ఎర్రమట్టి మ్యాచ్‌ జరిగే కొద్దీ విచ్చిన్నమవుతుంది. అయితే, నల్ల మట్టితో తయారు చేసిన పిచ్‌ అలా ఉండదు. లైట్ల కింద చాలా బాగుంటుంది. ఎర్రమట్టి పిచ్‌పై తేమ ప్రభావం ఉండదు. అయితే, మధ్యాహ్నం వేళ నల్లమట్టి పిచ్‌పై టర్నింగ్‌ ఉంటుంది. అదే రాత్రి సమయానికి కాంక్రీట్‌లా గట్టిగా మారిపోతుంది’ అని చెప్పాడు. ఆ సమాధానం నన్ను విస్తుపోయేలా చేసింది’’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌లో వెల్లడించాడు. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 240 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనప్పటికీ ట్రావిస్‌ హెడ్‌ అద్భుత శతకంతో ఆసీస్‌ను గెలిపించాడు. కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో 241 పరుగులు చేసి విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు