భారత అమ్మాయిలదే సిరీస్‌

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నారు.

Published : 03 May 2024 02:10 IST

మూడో టీ20లో బంగ్లాపై విజయం

సిల్‌హట్‌: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నారు. గురువారం మూడో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. మొదట బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులే చేయగలిగింది. ఓపెనర్‌ దిలారా అక్తర్‌ (39; 27 బంతుల్లో 5×4) టాప్‌స్కోరర్‌. రాధ యాదవ్‌ (2/22) రెండు వికెట్లతో మెరిసింది. ఇన్నింగ్స్‌ను బంగ్లా మెరుగ్గానే ఆరంభించింది. ఒక్క వికెట్టూ కోల్పోకుండా పవర్‌ప్లేలో 44 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్లో ముర్షీద (9) రనౌట్‌తో పోటీలోకి వచ్చిన భారత్‌ పట్టుబిగించింది. రేణుక, పూజ, శ్రేయాంక తలో వికెట్‌ తీశారు. ఛేదనలో ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ షెఫాలి వర్మ (51; 38 బంతుల్లో 8×4), స్మృతి మంధాన (47; 42 బంతుల్లో 5×4, 1×6) చెలరే గడంతో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేసింది. ముఖ్యంగా షెఫాలి ధనాధన్‌ షాట్లతో సాగిపోయింది. మంధాన కూడా ఫామ్‌ అందుకోవడంతో భారత్‌ గెలుపు నల్లేరుపై నడకే అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని