భారత్‌కు షాక్‌

రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్‌ ఛాంపియన్‌షిప్‌గా పరిగణించే థామస్‌ కప్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

Published : 03 May 2024 02:09 IST

థామస్‌ కప్‌లో క్వార్టర్స్‌లోనే ఔట్‌
ఉబర్‌ కప్‌లోనూ నిరాశే
చెంగ్డూ

రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్‌ ఛాంపియన్‌షిప్‌గా పరిగణించే థామస్‌ కప్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. కానీ ఈ సారి ఎన్నో అంచనాలతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత్‌కు షాక్‌ తగిలింది. బుధవారం గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో ఇండోనేషియా చేతిలో ఓడిన పురుష షట్లర్లు.. ఆ ఓటమి నుంచి పుంజుకోలేకపోయారు. గురువారం కీలకమైన క్వార్టర్స్‌లో భారత్‌ 1-3 తేడాతో చైనా చేతిలో పరాజయం పాలైంది. ఇండోనేషియాతో మ్యాచ్‌లో పోరాడి అలసిపోయిన భారత ఆటగాళ్లు.. ఒక్క రోజు కూడా గడవకముందే ఆతిథ్య చైనాతో తలపడాల్సి రావడం చేటు చేసిందనే చెప్పాలి. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-15, 11-21, 14-21తో రెండో ర్యాంకర్‌ షి యు కి చేతిలో ఓడాడు. డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జంట 15-21, 21-11, 12-21తో ప్రపంచ నంబర్‌వన్‌ లియాంగ్‌- వాంగ్‌ జోడీపై గెలవలేకపోయింది. భారత్‌ 0-2తో వెనుకబడ్డ దశలో లక్ష్యసేన్‌ 13-21, 21-8, 21-14తో ఫెంగ్‌పై నెగ్గి ఆశలు నిలిపాడు. కానీ వెంటనే మరో డబుల్స్‌లో ధ్రువ్‌- సాయి ద్వయం 10-21, 10-21తో జియాంగ్‌- టింగ్‌ చేతిలో పరాజయం చెందడంతో భారత్‌ కథ ముగిసింది. మరోవైపు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గైర్హాజరీతో ద్వితీయ శ్రేణి జట్టుగా ఉబర్‌ కప్‌లో అడుగుపెట్టిన మహిళల జట్టు పోరాటానికి తెరపడింది. క్వార్టర్స్‌లో భారత్‌ 0-3 తేడాతో బలమైన జపాన్‌ చేతిలో చిత్తయింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 53వ ర్యాంకర్‌ అస్మిత 10-21, 22-20, 15-21తో 11వ ర్యాంకర్‌ ఒహోరి చేతిలో పోరాడి ఓడింది. డబుల్స్‌లో ప్రియ- శ్రుతి జోడీ 8-21, 9-21తో మత్సుయామ- చిహారు చేతిలో, మరో సింగిల్స్‌ మ్యాచ్‌లో ఇషారాణి 15-21, 12-21తో నజోమి ఒకుహర చేతిలో పరాజయం చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు