నితీశ్‌ నిలకడగా

విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్‌గా రెండు మ్యాచ్‌లాడిన అతను.. ఈ సీజన్‌లో టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌గా సత్తాచాటుతున్నాడు.

Published : 03 May 2024 02:15 IST

విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్‌గా రెండు మ్యాచ్‌లాడిన అతను.. ఈ సీజన్‌లో టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌గా సత్తాచాటుతున్నాడు. పేస్‌ బౌలింగ్‌తోనూ మెరుస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విలువైన పరుగులు చేసి ఆదుకుంటున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 35కే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ జట్టును నితీశ్‌ ఆదుకున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. పిచ్‌పై అవగాహనకు రావడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగిపోవడం.. ఇదే నితీశ్‌ నైజం. రాజస్థాన్‌పై తొలి  10 బంతుల్లో 5 పరుగులే చేసిన అతను ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో విజయవంతమైన స్పిన్నర్‌ చాహల్‌ ఓవర్లో నితీశ్‌ 21 పరుగులు రాబట్టడం విశేషం. ఇందులో రివర్స్‌స్వీప్‌తో అతను కొట్టిన ఫోర్‌ ఆకట్టుకుంది. దిగ్గజ స్పిన్నర్‌ అశ్విన్‌ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో మెరిశాడు. అజేయంగా 76 పరుగులతో టీ20 కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దిల్లీపై 37 (27 బంతుల్లో) పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు పంజాబ్‌తో మ్యాచ్‌లో 39/3తో నిలిచిన జట్టును అద్భుతమైన 64 పరుగుల ఇన్నింగ్స్‌తో 20 ఏళ్ల నితీశ్‌ ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ ఓ వికెట్‌ తీసిన అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫోర్ల కంటే సిక్సర్లను అలవోకగా రాబట్టే నితీశ్‌ ఇప్పటివరకూ 6 ఇన్నింగ్స్‌లో 154 స్ట్రైక్‌రేట్‌తో 219 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 17 సిక్సర్లు కొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు