అందుకే నలుగురు స్పిన్నర్లు

 టీ20 ప్రపంచకప్‌కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా స్పష్టతతో ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్‌ పాత్ర స్వల్పమని చెప్పాడు.

Published : 03 May 2024 02:13 IST

ముంబయి:  టీ20 ప్రపంచకప్‌కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా స్పష్టతతో ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్‌ పాత్ర స్వల్పమని చెప్పాడు. నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ‘‘ఈ విషయంపై నేను వివరాల్లోకి వెళ్లదలచుకోలేదు. నలుగురు స్పిన్నర్లు కావాలని నేను బలంగా కోరుకున్నా. వెస్టిండీస్‌లో మేం చాలా క్రికెట్‌ ఆడాం. మ్యాచ్‌ ఉదయం పది గంటలకు మొదలవుతుంది. నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడంలో సాంకేతిక కోణం ఉంది. నలుగురు ఎందుకన్నది ఇప్పుడే చెప్పను. నలుగురిలో ఇద్దరు ఆల్‌రౌండర్లు. ఇది జట్టుకు సమతూకాన్నిస్తుంది’’ అని రోహిత్‌ చెప్పాడు. మిడిల్‌ ఓవర్లలో జట్టు అవసరాలపై చాలా దృష్టిపెట్టామని రోహిత్‌ తెలిపాడు. రింకును కాదని శివమ్‌ దూబెను ఎంపిక చేయడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘మేం మిడిల్‌ ఓవర్ల హిట్టింగ్‌పై దృష్టిపెట్టాం. టాప్‌ ఆర్డర్‌ హిట్టింగ్‌ ఫర్వాలేదు. అంత పేలవంగా ఏమీ లేదు’’ అని రోహిత్‌ చెప్పాడు. ఐపీఎల్‌కు ముందే 70-80 శాతం జట్టుపై తనకు స్పష్టత ఉందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచకప్‌ కోసం 15 మంది ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. కొన్ని స్థానాల కోసమే ఐపీఎల్‌లో చూశాం’’ అని రోహిత్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై స్పందిస్తూ.. ‘‘జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవు. అయినా నేను ఇతరుల కెప్టెన్సీలో ఆడటం ఇదే కొత్త కాదు’’ అని అన్నాడు.


రింకును తప్పించడం కష్టమైంది

ప్రపంచకప్‌ జట్టుకు రింకు సింగ్‌ను ఎంపిక చేయకపోవడమనేది తాము తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు. రింకు చేసిన తప్పేమీ లేదని చెప్పాడు. భారత్‌ తరఫున టీ20ల్లో 89 సగటు, 176.24 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన రింకుకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడం చాలా చర్చనీయాంశమైన నేపథ్యంలో అగార్కర్‌ స్పందించాడు. ‘‘రింకును తీసుకోకపోవడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. అతడు చేసిన తప్పేమీ లేదు. శుభ్‌మన్‌ గిల్‌ కూడా అంతే. కూర్పు కారణంగా రింకు ఎంపిక కాలేదు. రోహిత్‌కు మరిన్ని ప్రత్యామ్నాయాలను ఇవ్వడం కోసం నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశాం. రింకుకు అవకాశం దక్కకపోవడం దురదృష్టకరం. అతడు రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. 15 మందిలో ఉండడానికి అతడు ఎంత చేరువగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అని అగార్కర్‌ చెప్పాడు. హార్దిక్‌ పాండ్య ఎంపికను అతడు సమర్థించాడు. ఫిట్‌గా ఉన్నంతవరకు ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌కు ప్రత్యామ్నాయం లేదని అతడు అన్నాడు. కోహ్లి గొప్ప ఫామ్‌లో ఉన్నాడని, అతడి స్ట్రైక్‌రేట్‌పై సెలక్షన్‌ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని