పేద చిన్నారుల కోసం బోపన్న

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు.

Published : 03 May 2024 02:00 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. కమల్‌ ఇండియా ఫౌండేషన్‌ యూకేతో కలిసి రోహన్‌ బోపన్న టెన్నిస్‌ అకాడమీ (ఆర్బీటీఏ) ఈ శిక్షణ ఇవ్వనుంది. అస్సాంలోని మజూలి ద్వీపం, బొంగాయ్‌గాన్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన 25 మంది చిన్నారులను ఈ శిక్షణ కోసం బోపన్న ఎంపిక చేశారు. నైపుణ్య, ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తమ ప్రదర్శన నమోదు చేసిన పిల్లలను స్వయంగా బోపన్ననే ఎంచుకున్నాడు. 9 నుంచి 11 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఈ పిల్లలను బెంగళూరుకు తరలించి అక్కడే ప్రపంచ స్థాయి వసతులతో కూడిన ఆర్బీటీఏ అకాడమీలో బోపన్న మార్గనిర్దేశనంలో శిక్షణ ఇస్తారు. ఉండటానికి వసతి కూడా కల్పించడంతో పాటు ఈ పిల్లల విద్యా అవసరాలూ చూసుకుంటారు. ‘‘కమల్‌ ఇండియా ఫౌండేషన్‌ యూకేతో కలిసి ఈ ప్రతిభావంతులైన చిన్నారులకు ఈ అవకాశం కల్పించడం పట్ల ఉత్తేజితంగా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా కేవలం వీళ్లలోని అథ్లెటిక్‌ నైపుణ్యాలను మెరుగుపర్చడమే కాకుండా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా మంచి చదువు, జీవిత పాఠాలూ నేర్పించడమే లక్ష్యం. ఈశాన్య భారత్‌ నుంచి పిల్లలను తీసుకోవాలని ఓ దాత కోరాడు. అందుకే అస్సాంతో మొదలెట్టాం. మొత్తం 300 మందికి గాను 25 మందిని ఇప్పుడు తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను ఎంపిక చేస్తాం’’ అని బోపన్న తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు