ఇప్పటికీ అర్థం కాని విషయమది: కుంబ్లే

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌తో తననెందుకు పోలుస్తారో అర్థం కాదని టీమ్‌ఇండియా మాజీ సారథి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. వార్న్‌, మురళీధరన్‌ తర్వాత ఎక్కువ వికెట్లు తీసినందుకు అద్భుతంగా అనిపిస్తుందని....

Published : 26 Jul 2020 02:52 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌తో తననెందుకు పోలుస్తారో అర్థం కాదని టీమ్‌ఇండియా మాజీ సారథి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. వార్న్‌, మురళీధరన్‌ తర్వాత ఎక్కువ వికెట్లు తీసినందుకు అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. జింబాబ్వే మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యత పొమి ఎంబగ్వాతో ఇన్‌స్టాగ్రామ్‌లో జంబో మాట్లాడిన సంగతి తెలిసిందే.

‘ఎక్కువ వికెట్లు తీసినందుకు అద్భుతంగా అనిపిస్తుంది. అయితే గణాంకాలు, సగటు గురించి ఎక్కువగా ఆలోచించను. రోజంతా బౌలింగ్‌ చేసి వికెట్లు తీయాలన్నదే నా అభిమతం.  షేన్‌వార్న్‌, మురళీధరన్‌ తర్వాత టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీయడం ప్రత్యేకం. ఎందుకంటే మేము ఒకేతరంలో ఆడాం. అందుకే ఎక్కువ పోలికలు వచ్చాయి. కానీ ప్రజలు వార్న్‌తో ఎందుకు నన్ను పోలుస్తారో అర్థం కాదు. అతడు చాలా భిన్నం’ అని కుంబ్లే అన్నారు.

‘వారిద్దరూ ఎలాంటి పిచ్‌పై అయినా బంతిని గింగిరాలు తిప్పగలరు. అందుకే వార్న్‌, మురళీతో నన్ను పోల్చినప్పుడు నిజంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారిద్దరినీ చూసి నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని కుంబ్లే తెలిపారు. 2008లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన సుదీర్ఘ ఫార్మాట్‌లో 619 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ముత్తయ్య మురళీధరన్‌ 800, షేన్‌వార్న్‌ 708 వికెట్లు పడగొట్టారు. కాగా జిమ్‌లేకర్‌ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనత మాత్రం కుంబ్లేకే దక్కింది. అదీ దాయది పాక్‌పై కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని