Team India: అతడే భారత ‘బాక్సాఫీస్‌’ క్రికెటర్: నాజర్ హుస్సేన్

వచ్చే ఏడాది భారత క్రికెట్‌లో బాక్సాఫీస్ హీరోగా నిలిచే ఆటగాడి పేరును ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్‌ హుస్సేన్ వెల్లడించాడు.

Published : 31 Dec 2023 14:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భవిష్యత్తులో క్రికెట్ దిగ్గజాలుగా శుభ్‌మన్‌ గిల్, రచిన్‌ రవీంద్ర అవతరిస్తారని అంచనా వేసిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత బాక్సాఫీస్‌ క్రికెటర్‌ ఎవరు అవుతారనేదానిపై నాజర్‌ స్పందించాడు. కొత్త సంవత్సరంలో టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్ ‘బాక్సాఫీస్‌ క్రికెటర్‌’ అవుతాడని నాజర్‌ వ్యాఖ్యానించాడు. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌నాటికి మైదానంలోకి దిగుతాడని అంచనా. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఈ డ్యాషింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్ కీలకంగా మారతాడని నాజర్‌ వ్యాఖ్యానించాడు.

‘‘రిషభ్‌ పంత్‌ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో క్రికెట్ ప్రపంచమంతా ఆందోళనకు గురైంది. ఇప్పుడు కోలుకోవడంతో ఊపిరి పీల్చుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌తో నేను చాన్నాళ్లు ఆడా. పాంటింగ్ నిరంతరం పంత్‌ రికవరీ మీద దృష్టిపెట్టాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై నేను రికీని వాకబు చేశా. మరికొద్ది రోజుల్లో మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిషభ్‌ పంత్ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు. నాణ్యమైన ప్రదర్శన చేశాడు. ఇలాంటి ఇద్దరు ఆటగాళ్లు జట్టుతోపాటు ఉండటం భారత్‌ అదృష్టం. ప్రమాదానికి గురికాకముందు బాక్సాఫీస్‌ హీరో.. ఇప్పుడు కోలుకుని వచ్చాక కూడా రిషభ్‌ పంతే అవుతాడు’’ అని నాజర్ హుస్సేన్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని