IND vs BAN: వాళ్లు టీమ్‌ఇండియా ఆటగాళ్లలా కనిపించడం లేదు.. మాజీ కోచ్‌ మండిపాటు

టీమ్‌ఇండియా బలహీనమైన ప్రదర్శనను తీవ్రంగా పరిగణించాలంటూ మాజీ కోచ్‌ మదన్‌ లాల్‌ అన్నాడు. 

Published : 09 Dec 2022 14:11 IST

దిల్లీ: ప్రస్తుత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే అసలు వీరు టీమ్‌ఇండియా(Team india) జట్టులోనే ఉన్నారా అనే అనుమానం కలుగుతోందంటూ భారత మాజీ కోచ్‌ మదన్‌ లాల్‌(Madan lal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా(Bangladesh)తో తొలి వన్డేలో 1 వికెట్‌ తేడాతో ఓడిన భారత్‌.. రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై ఈ మాజీ కోచ్‌ విరుచుకుపడ్డాడు.  

‘‘వారు టీమ్‌ఇండియా ఆటగాళ్లలా కనపడటం లేదు. దేశం కోసం ఆడాలన్న మక్కువ.. మునుపటి జోష్‌ లోపించింది. వారు విపరీతంగా అలసిపోయైనా ఉండాలి. లేక ఏదో అలా నెట్టుకొస్తున్నట్టుగానైనా ఆడుతుండాలి. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఈ మాజీ కోచ్‌ వ్యాఖ్యానించాడు. ఇక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇటీవల రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై కూడా మదన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘‘ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే భారత టీ20 లీగ్‌ సమయంలోనే తీసుకోవాలి. దేశం తరఫున ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఐసీసీ ట్రోఫీలను నిర్లక్ష్యం చేస్తే మన దేశ క్రికెట్‌ పతనమైపోతుంది. ఇటీవల టీమ్ఇండియా టాప్‌ ఆర్డర్‌ ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. గత మూడేళ్లకాలంలో సీనియర్‌ ఆటగాళ్లు నమోదు చేసిన శతకాలు ఎన్ని? పోనీ పోయిన ఏడాదిలో ఎన్ని చేశారు? వయసు రీత్యా వారికి కంటికి, చేతికి మధ్య సమన్వయం లోపిస్తోంది. కానీ, అనుభవమున్న టాప్‌ ఆర్డర్‌ ఆడలేకపోతే గెలుపు అవకాశాలు మనకు దూరమైనట్టే’’ అంటూ మదన్‌ పేర్కొన్నాడు. ఇతర దేశాలు ఒక్కో ఫార్మాట్‌లో దానికి అనువైన నైపుణ్యాలున్న ఆటగాళ్లతో ఆడిస్తున్నాయని.. మనమెందుకు అలా చేయకూడదని ప్రశ్నించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని