West Indies: విండీస్‌ నుంచి 2.. లఖ్‌నవూ నుంచి 16

వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమై.. క్రికెట్లో పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్ల దృక్పథం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 03 Jul 2023 08:37 IST

దిల్లీ: వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమై.. క్రికెట్లో పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్ల దృక్పథం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు ఆడేందుకు సీనియర్‌ ఆటగాళ్లు హెట్‌మయర్‌, ఆండ్రి రసెల్‌, సునీల్‌ నరైన్‌ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. నిరుడు విండీస్‌ బోర్డు 18 ఆటగాళ్లతో ప్రకటించిన కేంద్ర కాంట్రాక్టు జాబితాలో ఈ ముగ్గురు లేరు. ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు వీళ్లంతా స్వచ్ఛందంగా కాంట్రాక్టులకు దూరంగా ఉన్నారు. నికోలస్‌ పూరన్‌ మాత్రం క్వాలిఫయర్స్‌లో బరిలో దిగి ఓ సెంచరీ కూడా చేశాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపిస్తుండటంతో పూరన్‌ ఇంకెన్నాళ్లు విండీస్‌కు ఆడతాడన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సీపీఎల్‌, బీబీఎల్‌తో పాటు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) కూడా రాబోతుండటంతో విండీస్‌ జట్టుకు పూరన్‌ గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యపోనవరం లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఒక సీజన్‌కు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అతనికి   రూ.16 కోట్లు ఇస్తోంది. విండీస్‌ బోర్డు ఏడాదికి చెల్లించే మొత్తం (దాదాపు రూ.2 కోట్లు)తో పోలిస్తే ఇది 8 రెట్లు ఎక్కువ. రసెల్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.16 కోట్లు, హెట్‌మయర్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.8.50 కోట్లు చెల్లిస్తోంది. బోర్డు నుంచి వచ్చే ఆదాయం కంటే వీరికి ఒక్క ఐపీఎల్‌ నుంచే ఎన్నో రెట్ల ఆదాయం అందుతోంది. 2017 గణాంకాల ప్రకారం విండీస్‌ బోర్డు టెస్టుకు రూ.4.72 లక్షలు, వన్డేకు రూ.1.88 లక్షలు, టీ20కి రూ.1.42 లక్షలు మ్యాచ్‌ ఫీజుగా చెల్లిస్తోంది. తాజాగా మ్యాచ్‌ ఫీజును పెంచినా.. భారత ఆటగాళ్లతో పోలిస్తే 3-4 రెట్లు తక్కువే. టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.8 లక్షలు, టీ20కి రూ.4 లక్షలు బీసీసీఐ చెల్లిస్తోంది. కేంద్ర కాంట్రాక్టుల ప్రకారం రెండు ఫార్మాట్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తే ఏడాదికి రూ.1.97 కోట్లు లభిస్తాయి. మ్యాచ్‌ ఫీజులతో కలిపితే మూడు ఫార్మాట్లలో ఆడితే రూ.2.50 కోట్లు దక్కుతాయి. కానీ జాతీయ జట్టును విడిచిపెట్టి పూర్తిగా లీగ్‌లకే అంకితమైతే పది రెట్లకు తక్కువ కాకుండా ఆదాయం వస్తుండటంతో కరీబియన్‌ ఆటగాళ్లు అటువైపే చూస్తున్నారు. ఫలితమే తాజా దుస్థితి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని