Asia Cup 2023 - BCCI: ఏదో అనుకుంటే..
వన్డే ప్రపంచకప్‌కు ఆసియాకప్‌తో బాగా సన్నద్ధం కావొచ్చని, బలాబలాలను పరీక్షించుకోవచ్చని భావించింది టీమ్‌ఇండియా. కానీ వరుణుడే కలవరపెడుతున్నాడు.
ఈనాడు క్రీడావిభాగం
వన్డే ప్రపంచకప్‌కు ఆసియాకప్‌తో బాగా సన్నద్ధం కావొచ్చని, బలాబలాలను పరీక్షించుకోవచ్చని భావించింది టీమ్‌ఇండియా. కానీ వరుణుడే కలవరపెడుతున్నాడు. ప్రణాళికలన్నింటినీ దెబ్బతీసేలా కనిపిస్తున్నాడు. ఈ సమయంలో ఆసియాకప్ వేదికగా శ్రీలంకను ఎంచుకోవడం బీసీసీఐ చేసిన పెద్ద తప్పా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గాయాల నుంచి కోలుకుని వచ్చిన ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు పరీక్షగా నిలుస్తుంది, ప్రపంచకప్‌కు ముందు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుంది, జట్టు కూర్పుపైనా ఓ అవగాహనకు రావొచ్చు..! ఆసియాకప్ గురించి టీమ్‌ఇండియా అనుకున్నది ఇది. కానీ జరుగుతున్నది వేరు. సరైన మ్యాచ్ టైమ్ లేకుండానే రోహిత్‌సేన టోర్నీని ముగించే అవకాశాలే మెండు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాస్తా వర్షార్పణమైంది. ఒక్కటే ఇన్నింగ్స్ సాధ్యమైంది. బౌలర్లు బంతే అందుకోలేదు. సుదీర్ఘ విరామానంతరం పునరాగమనం చేసిన బుమ్రా ఇంకా వన్డే మ్యాచ్‌లో బౌలింగ్ చేయనేలేదు. వ్యక్తిగత కారణాలతో నేపాల్ మ్యాచ్‌లో అతడు ఆడలేదు. నేపాల్‌తో మ్యాచ్ కూడా వర్షం వల్ల సవ్యంగా సాగలేదు. పల్లెకెలెలో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లూ వర్షం ముప్పును ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వేదిక కొలంబోకు మారింది. సెప్టెంబరు 17న ఫైనల్ కూడా అక్కడే. కానీ మ్యాచ్‌లు సజావుగా సాగడంపై ఆందోళన మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. రుతుపవనాల ఆలస్యం వలన గత రెండు వారాలుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రోజుల్లోనూ వాన కురుస్తుందని అంచనా. అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం ఏంటంటే.. భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే సూపర్-4 మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ఆ రోజంతా వాన పడే అవకాశం 75 శాతానికి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే ఆశ్చర్యం లేదు. అంతే కాదు.. 9వ తేదీ నుంచి 17 వరకు ప్రతి రోజూ కొలంబోలో వర్షాలు పడే అవకాశాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. అంటే మొత్తం టోర్నీనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇది ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి ఇదో గొప్ప అవకాశమని భావించిన అన్ని జట్లకూ నిరాశ కలిగించే విషయమే.
ప్రాక్టీస్ ఇండోర్‌లో..
కొలంబోలో వర్షాల కారణంగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైంది. గురువారం చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ శిక్షకుడు విక్రమ్ రాఠోడ్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు సాధన చేశారు. శస్త్రచికిత్స తర్వాత సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మళ్లీ భారత బృందంలో చేరాడు. నెట్స్‌లో మునుపటి లయతో కనిపించాడు. మంచి టైమింగ్‌తో షాట్లు.. హాఫ్ డ్రైవ్‌లు ఆడాడు. వికెట్ కీపింగ్ మాత్రం చేయలేదు. కేఎల్‌తో పాటు హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ ఇండోర్ సెషన్‌లో పాల్గొన్నారు. మొదట త్రోలను రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదాల్ని చురుగ్గా కదిలించాడు. గిల్ కూడా చాలాసేపు నెట్స్‌లో చెమటోడ్చాడు. ఇక ఈ ఏడాది మార్చిలో రాహుల్ చివరి సారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో తొడ కండరాల గాయానికి గురైన రాహుల్‌కు అనంతరం శస్త్రచికిత్స జరిగింది.
అది తప్పా?
అసలు సెప్టెంబరులో శ్రీలంకలో ఆసియాకప్ నిర్వహించడమే సరికాదని అంటున్నారు. ‘‘సాధారణంగా సెప్టెంబరు నెలలో శ్రీలంకలో వానలు కురుస్తాయి. ప్రపంచకప్‌కు ఎన్నో రోజులు లేదు. ఇక్కడ పరిస్థితులు భారత్‌కు దగ్గరగా ఉంటాయి. ఆసియాకప్‌తో పరిస్థితులపై అవగాహన పెంచుకోవచ్చని, మేళవింపులను పరీక్షించుకోవచ్చని జట్లు భావించి ఉంటాయి. వాతావరణం మెరుగుపడుతుందని ఆశిస్తున్నా’’ శ్రీలంక మాజీ ఆటగాడు, లంక బోర్డు మాజీ ఛైర్మన్ వెట్టిముని అన్నాడు. నిజానికి ఆసియాకప్ వేదిక పాకిస్థాన్ అయినా.. భారత్ ఆ దేశానికి జట్టును పంపడానికి తిరస్కరించింది. ముందు టోర్నీ మొత్తాన్ని తామే నిర్వహిస్తామని పట్టుబట్టిన పాక్, ఆ తర్వాత తాము ఆతిథ్యమిచ్చే కొన్ని మ్యాచ్‌లు కాకుండా.. మిగతా మ్యాచ్‌లను యూఏఈలోనైనా నిర్వహించాలని కోరింది. కానీ అందుకు కూడా బీసీసీఐ (బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా) ఒప్పుకోలేదు. తాను కోరుకున్నట్లు ఎక్కువ మ్యాచ్‌లు లంకలో జరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ అధికారులు ఇప్పుడు భారత్‌పై మండిపడుతున్నారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒప్పుకోలేదు. ఇంత తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని అక్కడికి తరలించడం చాలా కష్టమని ప్రసారదారు చెప్పడమే అందుకు కారణమని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
Art of living: గురుదేవ్ లేకుంటే మా దేశంలో శాంతి అసాధ్యం: కొలంబియా ఎంపీ
-
యువకుడి కడుపులో గర్భాశయం.. కంగుతిన్న వైద్యులు