ఆ స్పిన్నర్ల ఉచ్చులో కోహ్లి!

ప్రేమదాస స్టేడియంలో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ వన్డేల్లో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. అదే స్టేడియంలో పాకిస్థాన్‌పై అజేయ శతకంతో చెలరేగాడు.

Published : 14 Sep 2023 02:34 IST

కొలంబో

ప్రేమదాస స్టేడియంలో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ వన్డేల్లో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. అదే స్టేడియంలో పాకిస్థాన్‌పై అజేయ శతకంతో చెలరేగాడు. కానీ ఒక్క రోజు వ్యవధిలోనే అదే మైదానంలో పక్కనే ఉన్న పిచ్‌పై శ్రీలంకతో మ్యాచ్‌లో 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. స్పిన్‌కు చక్కగా అనుకూలించిన పిచ్‌పై ఎడమ చేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగె బౌలింగ్‌లో అతను నిష్క్రమించాడు. ఇది ఒక్క ఇన్నింగ్సే కదా.. కోహ్లి మళ్లీ పుంజుకుంటాడనే ఆశలు పెట్టుకోవచ్చు. కానీ పదేపదే ఎడమ చేతి వాటం స్పిన్నర్ల ఉచ్చులో కోహ్లి పడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కేశవ్‌ మహరాజ్‌ (దక్షిణాఫ్రికా), మిచెల్‌ శాంట్నర్‌ (న్యూజిలాండ్‌), షకిబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), ఆష్టన్‌ అగర్‌ (ఆస్ట్రేలియా), ఇప్పుడు దునిత్‌.. వీళ్లందరూ వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. కానీ వీళ్ల మధ్య ఓ సారూప్యత ఉంది. అదే ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. 2021 నుంచి వన్డేల్లో కోహ్లీని వీళ్లు ఔట్‌ చేశారు. కేశవ్‌, శాంట్నర్‌, షకిబ్‌ అయితే రెండేసి సార్లు కోహ్లీని పెవిలియన్‌ చేర్చారు. 2021 జనవరి నుంచి 28 వన్డేల్లో కోహ్లి ఎనిమిది సార్లు ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్లకే వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ బౌలర్ల బౌలింగ్‌లో 159 బంతులు ఆడిన అతను 104 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 65.4గానే ఉంది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లి చాలా ఇబ్బంది పడుతున్నాడనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. తాజాగా దునిత్‌ వెల్లలాగె బౌలింగ్‌లో కోహ్లి ఔటైన విధానం మరింత ఆందోళన కలిగిస్తోంది. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తోందని తెలిసి కోహ్లి నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. కానీ వలయం లోపల అదనపు ఫీల్డర్లను మోహరించడంతో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం కోహ్లీకి కష్టమైపోయింది. అతను స్వీప్‌ను ఎక్కువగా ఆడే ఆటగాడు కాదు. దీంతో డాట్‌బాల్స్‌ పెరిగిపోయాయి. పరుగులు సాధించాలనే ఉద్దేశంతో మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ ఆడదామనుకున్నాడు. కానీ బంతిని తప్పుగా అంచనా వేసి శానక చేతికి చిక్కాడు. పార్ల్‌లో ఒకసారి ఇలాగే కేశవ్‌ బౌలింగ్‌ కోహ్లి ఔటయ్యాడు. మీర్పూర్‌లో షకిబ్‌ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ ఇలాగే క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. ఆసియా కప్‌లో శుక్రవారం ప్రేమదాస మైదానంలోనే బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కచ్చితంగా షకిబ్‌ ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. వచ్చే నెలలో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. భారత్‌్ తన తొలి మ్యాచ్‌ చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనే సంగతి తెలిసిందే. మరి అక్కడ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అగార్‌ను కోహ్లి ఎలా ఎదుర్కుంటాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క మ్యాచ్‌ అనే కాదు దాదాపు ప్రపంచకప్‌ మొత్తం కోహ్లీకి స్పిన్‌ సవాలు తప్పదు. అతని బలహీనతను అవకాశంగా మార్చుకోవడం కోసం ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. మరి ఇప్పటికే ఎన్నో బలహీనతలను అధిగమించి, ఎప్పటికప్పుడూ ఆటతీరును మెరుగుపర్చుకుంటూ సాగుతున్న కోహ్లి ఈ సమస్య నుంచి కూడా బయట పడేందుకు మార్గం అన్వేషిస్తాడనే అంచనాలున్నాయి. ఎడమ చేతి వాటం స్పిన్నర్లపై కోహ్లి ఆధిపత్యం ప్రదర్శిస్తే అది అతనితో పాటు జట్టుకూ ఎంతో మేలు చేసేదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని