ట్రాక్‌పై రయ్‌రయ్‌

భారత్‌లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్‌ అంతర్జాతీయ సర్క్యూట్‌లో మోటోజీపీలో భాగంగా ఇండియన్‌ఆయిల్‌ గ్రాండ్‌ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది

Published : 23 Sep 2023 03:04 IST

గ్రేటర్‌ నోయిడా: భారత్‌లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్‌ అంతర్జాతీయ సర్క్యూట్‌లో మోటోజీపీలో భాగంగా ఇండియన్‌ఆయిల్‌ గ్రాండ్‌ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్‌ రేసులు జరిగాయి. శనివారం ప్రాక్టీస్‌తో పాటు అర్హత రేసులు నిర్వహిస్తారు. ప్రధానంగా మోటోజీపీ (24 ల్యాప్‌లు), మోటో2 (19 ల్యాప్‌లు), మోటో3 (17 ల్యాప్‌లు) రేసులు అభిమానులను అలరించబోతున్నాయి.


నసీమ్‌ ఔట్‌
ప్రపంచకప్‌కు పాక్‌ జట్టు

లాహోర్‌: భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. యువ పేసర్‌ నసీమ్‌ షాకు చోటు దక్కలేదు. ఆసియాకప్‌లో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్‌ స్థానంలో హసన్‌ అలీ జట్టులోకి వచ్చాడు.

పాకిస్థాన్‌ జట్టు: బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), షాదాబ్‌ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, షఫీఖ్‌, షకీల్‌, ఫకార్‌ జమాన్‌, హారిస్‌ రవూఫ్‌, హసన్‌ అలీ, ఇఫ్తికార్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీమ్‌, ఆగా సల్మాన్‌, షహీన్‌షా అఫ్రిది, ఒసామా మీర్‌


ప్రపంచకప్‌ విజేతకు రూ.33 కోట్లు

దుబాయ్‌: వన్డే ప్రపంచకప్‌ కైవసం చేసుకునే జట్టు సుమారు రూ.33 కోట్లు నగదు బహుమతిగా పొందబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ వెల్లడించింది. రన్నరప్‌కు రూ.16 కోట్లు లభించనున్నాయి. సెమీఫైనల్లో ఓడే రెండు జట్లు రూ.6 కోట్ల చొప్పున అందుకుంటాయి. నాకౌట్‌ చేరడంలో విఫలమయ్యే ఒక్కో జట్టుకు రూ.82 లక్షలు.. లీగ్‌ దశలో మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్లకు రూ.33 లక్షల చొప్పున బహుమతి అందనుంది. ప్రపంచకప్‌కు ఐసీసీ మొత్తం రూ.82 కోట్లు ప్రైజ్‌మనీగా కేటాయించింది. భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో లీగ్‌ దశలో 45 మ్యాచ్‌లు, నాకౌట్‌లో 3 మ్యాచ్‌లు జరుగుతాయి.


కరీబియన్‌ దీవుల్లో ఏడు వేదికలు

దుబాయ్‌: 2024 టీ20 ప్రపంచకప్‌ కోసం కరీబియన్‌ దీవుల్లో ఏడు వేదికలను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జూన్‌ 4న ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌కు ఆంటిగ్వా అండ్‌ బార్బాడా, బార్బడోస్‌, డొమినికా, గయానా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనాడైన్స్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. ఈ కప్‌ను వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌లను ఐసీసీ వేదికలుగా ఎంపిక చేసింది. 20 జట్లు తలపడే టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి.


అఫ్గాన్‌.. రెండు వైపుల నుంచి

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో అఫ్గానిస్తాన్‌ క్రీడాకారుల పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. క్రీడాకారులది ఒకే దేశమైనా భిన్నమైన ప్రాంతాల నుంచి రావడమే ఇందుకు కారణం. అఫ్గాన్‌పై తాలిబన్లు నియంత్రణ సాధించిన తర్వాత జరుగుతున్న తొలి ఆసియా క్రీడలు ఇవే. తాలిబన్ల పాలనలో క్రీడల్లో మహిళలపై విధించగా.. అక్కడ్నుంచి 130 మంది పురుషులతో ఒక బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. వాలీబాల్‌, జూడో, రెజ్లింగ్‌ సహా 17 క్రీడాంశాల్లో ఈ జట్టు బరిలో దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఫ్గాన్‌ క్రీడాకారులతో మరో బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. అందులో 17 మంది మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. తాలిబన్ల పాలనకు ముందు ఏర్పడిన అఫ్గాన్‌ జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు హఫీజుల్లా వలీ రహీమి ఈ బృందాన్ని చైనాకు తీసుకొచ్చాడు. ఇరాన్‌లో వాలీబాల్‌, ఇటలీలో సైక్లింగ్‌, ఆస్ట్రేలియాలో అథ్లెటిక్స్‌లో క్రీడాకారిణులు శిక్షణ తీసుకుంటున్నట్లు రహీమి వివరించాడు. మరి నిర్వాహకులు ఒకే జాతీయ జెండా కింద రెండు బృందాలకు అనుమతిస్తారా? ఏ జట్టును గుర్తిస్తారు? అన్నది చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని