Asian Games 2022: ఆసియాను గెలవాలని

నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంబరం.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ తర్వాత ఎంతో ప్రాధాన్యం ఉన్న పెద్ద క్రీడా పండుగ! ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం సమరం!

Updated : 23 Sep 2023 09:38 IST

ఏషియాడ్‌కు సిద్ధమైన భారత్‌
పతకాల సెంచరీపై మన అథ్లెట్ల కన్ను
నేడే చైనాలో అధికారిక ప్రారంభోత్సవం

నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంబరం.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ తర్వాత ఎంతో ప్రాధాన్యం ఉన్న పెద్ద క్రీడా పండుగ! ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం సమరం! అథ్లెట్ల మధ్య పతకాల యుద్ధం! అందుకు వేదిక ఆసియా క్రీడలు. మరోసారి ఈ మెగా క్రీడలకు తరుణం ఆసన్నమైంది. అద్భుతమైన నైపుణ్యాలతో.. అచ్చెరువొందే విన్యాసాలతో.. అలుపెరగని పోరాటంతో.. పతకాల వేటలో సాగేందుకు అథ్లెట్లు సై అంటున్నారు. ఇప్పటికే వివిధ క్రీడల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం అధికారికంగా ఈ క్రీడలు ఆరంభమవుతాయి. కరోనా తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రీడా ఈవెంట్‌లో పతకాల సెంచరీ కొట్టేందుకు నీరజ్‌ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. ఊరిస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులు ఈ క్రీడలను మరింత ప్రత్యేకంగా మార్చేశాయ్‌. ఇక అక్టోబర్‌ 8 వరకు ఆటలే ఆటలు!

హాంగ్‌జౌ

19వ ఆసియా క్రీడలకు చైనా ముస్తాబైంది. ఇప్పటికే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, క్రికెట్‌, రోయింగ్‌, సెయిలింగ్‌, పెంటథ్లాన్‌లో పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడా గ్రామం సందడిగా మారింది. నేడు అధికారిక ఆరంభోత్స కార్యక్రమంతో క్రీడల సందడి మరోస్థాయికి చేరనుంది. అధికారికంగా ఈ నెల 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. నిజానికి 2022లో ఈ క్రీడలు జరగాల్సింది. చైనాలో కరోనా కేసులు కారణంగా ఓ ఏడాది వాయిదా వేశారు. అయినప్పటికీ వీటిని 2022 ఆసియా క్రీడలుగానే వ్యవహరిస్తున్నారు. 2018లో 70 (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) పతకాలు గెలిచిన భారత్‌.. ఈ సారి వంద పతకాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.  1986 నుంచి భారత్‌ టాప్‌-5లో నిలవలేదు. కానీ ఈ సారి చరిత్ర తిరగరాయాలనే సంకల్పంతో మన అథ్లెట్లున్నారు. 39 క్రీడల్లో 655 మంది అథ్లెట్లు పతకాల వేటకు సై అంటున్నారు. శనివారం సాయంత్రం 5.30కు మొదలయ్యే ఆరంభ వేడుకల్లో లవ్లీనా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ కెప్టెన్‌) భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

అథ్లెటిక్స్‌పై ఆశలు..

సియా క్రీడల్లో ఈ సారి రికార్డు స్థాయిలో పతకాలు గెలిచేందుకు సిద్ధమైన భారత్‌.. ప్రధానంగా అథ్లెటిక్స్‌పైనే ఆశలు పెట్టుకుంది. అథ్లెటిక్స్‌లోనే సింహభాగం పతకాలు వచ్చే అవకాశముంది. 2018లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా 20 పతకాలు గెలిచారు. ఈ సారి కనీసం 25 పతకాలు గెలుస్తారనే అంచనాలున్నాయి. భారత్‌ స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా 2018లో గెలిచిన పసిడిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. తెలుగమ్మాయిలు నందిని (హెప్టథ్లాన్‌), జ్యోతి యర్రాజి (100మీ.హార్డిల్స్‌, 200మీ.పరుగు), తేజస్విన్‌ శంకర్‌ (డెకథ్లాన్‌), తజిందర్‌పాల్‌ (షాట్‌పుట్‌), మురళీ శ్రీశంకర్‌, శైలి సింగ్‌ (లాంగ్‌జంప్‌), అవినాశ్‌ సాబ్లె, పారుల్‌ చౌదరి (3000మీ. స్టీపుల్‌ఛేజ్‌), ప్రవీణ్‌ చిత్రవేల్‌ (ట్రిపుల్‌ జంప్‌)తో పాటు రిలే జట్లూ పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. హాకీ, కబడ్డీ, క్రికెట్‌లో పురుషుల, మహిళల స్వర్ణాలు భారత్‌ ఖాతాలోనే చేరే ఆస్కారముంది. గత క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా 9 పతకాలు గెలిచిన షూటర్లు.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. షట్లర్లు, ఆర్చర్లు, బాక్సర్లు, రెజ్లర్లు కూడా బంగారు పతకాలపై కన్నేశారు.

తొలిసారి..

ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ- స్పోర్ట్స్‌, బ్రేక్‌ డ్యాన్సింగ్‌ను చేర్చారు. 2018లో ఈ- స్పోర్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ సారి అధికారికంగా పోటీలు నిర్వహిస్తున్నారు. 2010, 2014 తర్వాత మళ్లీ క్రికెట్‌ను చేర్చారు. 2018 విరామం తర్వాత చెస్‌, గో, జియాంగ్‌క్వీ తిరిగొచ్చాయి.

ఒలింపిక్స్‌ కంటే ఎక్కువ..

ప్రపంచంలో ఒలింపిక్స్‌ అత్యున్నత బహుళ క్రీడా టోర్నీ. కానీ ఒలింపిక్స్‌ కంటే ఆసియా క్రీడల్లోనే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ సారి హాంగ్‌జౌలో 45 దేశాల నుంచి 12 వేలకు పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతున్నారు. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో 11 వేలకు పైగా బరిలో దిగారు. వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో దాదాపు 10,500 మంది తలపడనున్నారు. 2018 ఆసియా క్రీడల్లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఇప్పుడా సంఖ్య దాటింది. ఈ సారి 40 క్రీడలకు సంబంధించి 61 క్రీడాంశాల్లో 481 స్వర్ణాలు గెలుచుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. ఆతిథ్య చైనా నుంచి 886 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. 2010లో ఆ దేశం అత్యధికంగా 977 మందిని బరిలో దింపింది. అథ్లెట్ల సంఖ్యలోనే కాదు పతకాల పట్టికలోనూ చైనాదే ఆధిపత్యం. 1982 నుంచి ప్రతి సారి ఆ దేశానిదే అగ్రస్థానం.

క్వార్టర్స్‌లో భారత వాలీబాల్‌ జట్టు

సియా క్రీడల వాలీబాల్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం భారత్‌ 3-0 (25-22, 25-22, 25-21)తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను చిత్తుచేసిన భారత్‌.. ఆదివారం జరిగే పోరులో జపాన్‌ లేదా కజకిస్థాన్‌తో తలపడుతుంది. మరోవైపు రోయింగ్‌లో భారత ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌ ఫైనల్‌-ఎలో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్‌ స్కల్‌ ఎఫ్‌ ఎ/బి2 సెమీస్‌లో పన్వర్‌ మూడో స్థానం (7 నిమిషాల 22.22 సెకన్లు)లో నిలిచాడు. ఫైనల్‌-ఎలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోయర్లకు పతకాలు లభిస్తాయి. టేబుల్‌ టెన్నిస్‌లోనూ భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల విభాగం గ్రూపు-ఎఫ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ వరుసగా 3-0తో యెమెన్‌, 3-1తో సింగపూర్‌పై విజయాలు నమోదు చేసింది.

ముగ్గురు అథ్లెట్లపై చైనా వివక్ష

దిల్లీ: ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న చైనా.. ముగ్గురు భారత అథ్లెట్ల పట్ల వివక్ష చూపించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌ వుషు క్రీడాకారిణులు నైమన్‌ వాంగ్సు, ఒనిలు టెగా, మెపుంగ్‌ లాంగుకు క్రీడల్లో పాల్గొనేందుకు చైనా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా పూర్తిగా తన భూభాగంగా పరిగణిస్తోంది. గుర్తింపు కార్డుల నిరాకరణపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేసింది. చైనా వివక్షాపూరిత ప్రవర్తనకు నిరసనగా కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆ దేశ పర్యటన (ఆసియా క్రీడల కోసం)ను రద్దు చేసుకున్నారు.


3

ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1990లో బీజింగ్‌లో, 2010లో గాంగ్జౌలో ఈ క్రీడలు జరిగాయి. 


672

ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ గెలిచిన పతకాలు. ఇందులో 155 స్వర్ణాలు, 201 రజతాలు, 316 కాంస్యాలున్నాయి. ఓవరాల్‌గా భారత్‌ అయిదో స్థానంలో ఉంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఇరాన్‌ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.


6

ఆసియా క్రీడలు జరిగే నగరాలు. హాంగ్‌జౌతో పాటు హుజౌ, నింగ్బో, షావోజింగ్‌, జిన్‌వా, వెంజౌలో క్రీడలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేదికల్లో పోటీలుంటాయి.

* ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన అయిదుగురు భారత అథ్లెట్లు బరిలో ఉండటం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పునియా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్‌ ఒలింపిక్స్‌ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.


19

ఇవి 19వ ఆసియా క్రీడలు. 1951లో మొట్టమొదటి సారి భారత్‌లోనే ఆసియా క్రీడలు జరిగాయి. 1954 తర్వాత నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కరోనా కారణంగా ఓ ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. 1982లోనూ ఈ క్రీడలకు భారత్‌ ఆతిథ్యమిచ్చింది.


రూ.11,610 కోట్లు

ఆసియా క్రీడల నిర్వహణ కోసం సుమారుగా చైనా చేస్తున్న ఖర్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని