IND vs AUS: షమి.. భగభగ

కోహ్లి లేడు.. రోహిత్‌ లేడు.. పాండ్య లేడు.. కుల్‌దీప్‌ లేడు.. ప్రపంచకప్‌లో ఎంతో కీలకమైన ఈ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అదరగొట్టింది టీమ్‌ఇండియా.

Updated : 23 Sep 2023 09:37 IST

నిప్పులు చెరిగిన పేసర్‌
మెరిసిన శుభ్‌మన్‌,రుతురాజ్‌
తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్‌ విజయం

కోహ్లి లేడు.. రోహిత్‌ లేడు.. పాండ్య లేడు.. కుల్‌దీప్‌ లేడు.. ప్రపంచకప్‌లో ఎంతో కీలకమైన ఈ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అదరగొట్టింది టీమ్‌ఇండియా. సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ షమి చాన్నాళ్ల తర్వాత తన పేస్‌ అస్త్రాలను బయటికి తీయడంతో మొహాలిలో భారత్‌కు తిరుగులేకపోయింది. షమి అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో కంగారూలను ఓ మోస్తరు స్కోరుకు పరిమితం చేసిన టీమ్‌ఇండియా.. యువ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ల వీరవిహారంతో మ్యాచ్‌ను తనవైపు తిప్పేసుకుంది. వీళ్లిద్దరూ వెనుదిరిగాక కొంత తడబడ్డా.. చివరికి విజయం భారత్‌దే.

మొహాలి

ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్‌.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మొదట ఆసీస్‌ సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మద్‌ షమి (5/51) ఆ జట్టును దెబ్బ తీశాడు. వార్నర్‌ (52; 53 బంతుల్లో 6×4, 2×6) టాప్‌స్కోరర్‌గా నిలవగా.. జోష్‌ ఇంగ్లిస్‌ (45; 45 బంతుల్లో 3×4, 2×6), స్టీవ్‌ స్మిత్‌ (41; 60 బంతుల్లో 3×4, 1×6), లబుషేన్‌ (39; 49 బంతుల్లో 3×4) తలో చేయి వేశారు. ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ (74; 63 బంతుల్లో 6×4, 2×6), రుతురాజ్‌ గైక్వాడ్‌ (71; 77 బంతుల్లో 10×4) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. సూర్యకుమార్‌ (50; 49 బంతుల్లో 5×4, 1×6) అండతో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (58 నాటౌట్‌; 63 బంతుల్లో 4×4, 1×6) మిగతా పని పూర్తి చేశాడు. భారత్‌ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా (2/57) రాణించాడు. రెండో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.

ఏకపక్షం అనుకుంటే..: ఛేదనలో భారత్‌కు దక్కిన ఆరంభం చూస్తే.. మ్యాచ్‌ 49వ ఓవర్‌ వరకు వెళ్తుందని, ఆస్ట్రేలియాకు గెలుపు మీద కాస్త ఆశ అయినా కలుగుతుందని, భారత్‌ 5 వికెట్లు కోల్పోతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్‌ గిల్‌.. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించేముందు అనుకోకుండా అవకాశం దక్కించుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టుకు గొప్ప ఆరంభాన్నిచ్చారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు కష్టపడి పరుగులు సాధించిన పిచ్‌పై ఈ ఇద్దరూ అలవోకగా బ్యాటింగ్‌ చేశారు. పోటీ పడి షాట్లు కొట్టారు. దీంతో 10 ఓవర్ల తొలి పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసిన భారత్‌.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించి 21 ఓవర్లకు 136/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. చూడముచ్చటైన షాట్లతో అలరించిన గిల్‌ 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడితో పోలిస్తే నెమ్మదిగా ఆడిన రుతురాజ్‌ 60 బంతుల్లో ఆ మార్కును అందుకున్నాడు. ఒక్క వికెట్టూ పడకుండానే లక్ష్యంలో సగం పైగా కరిగిపోవడంతో ఆసీస్‌ చిత్తుగా ఓడుతుందనిపించింది. కానీ స్పిన్నర్‌ జంపా.. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లిద్దరినీ ఔట్‌ చేసి ఆసీస్‌కు ఉపశమనాన్నిచ్చాడు. మధ్యలో శ్రేయస్‌ అయ్యర్‌ (3) చేజేతులా రనౌటయ్యాడు. దీంతో 142/0 నుంచి భారత్‌ 151/3కి చేరుకుంది. ఈ స్థితిలో ఇషాన్‌ (18)తో రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. క్రీజులో కుదురుకుంటున్న దశలో ఇషాన్‌ ఔటైనా భారత్‌కు ఇబ్బంది లేకపోయింది. సూర్యకుమార్‌ తొలిసారి వన్డేల్లో ఎక్కువసేపు క్రీజులో నిలిచి అర్ధశతకం సాధించడం.. రాహుల్‌ క్రీజులో పాతుకుపోవడంతో ఛేదన సాఫీగానే సాగిపోయింది. 21 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య ఔటైనా.. రాహుల్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

షమి అదరహో: అంతకుముందు పేస్‌కు అనుకూలంగా కనిపించిన పిచ్‌ను ఉపయోగించుకునే ఉద్దేశంతో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత పేసర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా పిచ్‌లో వేగం ఉంటే తాను ఎంత ప్రమాదకరమో షమి చూపించాడు. ఇటీవల స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న ఈ సీనియర్‌ పేసర్‌.. శుక్రవారం పదునైన బంతులతో రెచ్చిపోయాడు. శరవేగంగా దూసుకొచ్చిన అతడి బంతులను ఆడటం ఆసీస్‌ బ్యాటర్ల వల్ల కాలేదు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే షమి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆఫ్‌ స్టంప్‌ మీద సంధించిన బంతిని ఆడబోయి మిచెల్‌ మార్ష్‌ స్లిప్‌లో శుభ్‌మన్‌కు దొరికిపోయాడు. మరో ఎండ్‌లో బుమ్రా కూడా బ్యాటర్లకు అవకాశమివ్వలేదు. వరుసగా రెండు మెయిడెన్లతో మొదలుపెట్టిన అతను.. మరో ఓపెనర్‌ వార్నర్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. స్టీవ్‌ స్మిత్‌ కూడా ఆరంభంలో ఆచితూచి ఆడాడు. కానీ ఈ జోడీ కుదురుకున్నాక స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా వార్నర్‌ చెలరేగి ఆడి అర్ధశతకం సాధించాడు. 18 ఓవర్లకు 98/1తో పుంజుకుంది. అయితే క్రీజులో బాగా నిలదొక్కుకున్న వార్నర్‌, స్మిత్‌ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో ఆసీస్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. వార్నర్‌ను జడేజా పెవిలియన్‌ చేర్చగా.. స్మిత్‌ను షమి బౌల్డ్‌ చేశాడు. జడేజాకు తోడు అశ్విన్‌ సైతం కట్టుదిట్టంగా బంతులేయడంతో స్కోరు వేగం కూడా పడిపోయింది. ఈ స్థితిలో లబుషేన్‌, గ్రీన్‌ (31) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక 40 ఓవర్లకు 187/5తో నిలిచిన ఆసీస్‌.. 260 చేస్తే ఎక్కువ అనిపించింది. కానీ ఇంగ్లిస్‌, స్టాయినిస్‌ (29; 21 బంతుల్లో 5×4) ధాటిగా ఆడటంతో ఒక దశలో 300కు చేరువయ్యేలా కనిపించింది. అయితే షమి చివరి స్పెల్‌లో 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి కంగారూలను మరోమారు గట్టి దెబ్బ కొట్టాడు. కమిన్స్‌ (21 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) మెరుపులతో ఆసీస్‌ 270 దాటింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: మిచెల్‌ మార్ష్‌ (సి) శుభ్‌మన్‌ (బి) షమి 4; వార్నర్‌ (సి) శుభ్‌మన్‌ (బి) జడేజా 52; స్టీవ్‌ స్మిత్‌ (బి) షమి 41; లబుషేన్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) అశ్విన్‌ 39; గ్రీన్‌ రనౌట్‌ 31; ఇంగ్లిస్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 45; స్టాయినిస్‌ (బి) షమి 29; షార్ట్‌ (సి) సూర్యకుమార్‌ (బి) షమి 2; కమిన్స్‌ నాటౌట్‌ 21; సీన్‌ అబాట్‌ (బి) షమి 2; జంపా రనౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్‌) 276; వికెట్ల పతనం: 1-4, 2-98, 3-112, 4-157, 5-186, 6-248, 7-250, 8-254, 9-256; బౌలింగ్‌: షమి 10-1-51-5; బుమ్రా 10-2-43-1; శార్దూల్‌ 10-0-78-0; అశ్విన్‌ 10-0-47-1; జడేజా 10-0-51-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ ఎల్బీ (బి) జంపా 71; శుభ్‌మన్‌ (బి) జంపా 74; శ్రేయస్‌ రనౌట్‌ 3; రాహుల్‌ నాటౌట్‌ 58; ఇషాన్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) కమిన్స్‌ 18; సూర్యకుమార్‌ (సి) మార్ష్‌ (బి) అబాట్‌ 50, జడేజా నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (48.4 ఓవర్లలో 5 వికెట్లకు) 281

వికెట్ల పతనం: 1-142, 2-148, 3-151, 4-185, 5-265; బౌలింగ్‌: కమిన్స్‌ 10-0-44-1; స్టాయినిస్‌ 5-0-40-0; అబాట్‌ 9.4-1-56-1; గ్రీన్‌ 6-0-44-0; షార్ట్‌ 8-0-39-0; జంపా 10-0-57-2

5/51

షమి గణాంకాలు. వన్డేల్లో అతడికిదే ఉత్తమ ప్రదర్శన. అతను అయిదు వికెట్ల ప్రదర్శన చేయడమిది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని