కుర్రాళ్లకు పరీక్ష..!

సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌, విరాట్‌ లేరు. గాయంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ దూరమయ్యాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా విశ్రాంతిలో ఉన్నాడు. జట్టులో అంతా కుర్రాళ్లే.

Updated : 10 Dec 2023 05:20 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి

సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌, విరాట్‌ లేరు. గాయంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ దూరమయ్యాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా విశ్రాంతిలో ఉన్నాడు. జట్టులో అంతా కుర్రాళ్లే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో పొట్టి పరీక్షకు సిద్ధమైంది టీమ్‌ఇండియా. నేడే తొలి టీ20. సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత జట్టుకు గట్టి సవాలు తప్పదు. సొంతగడ్డపై సఫారీ జట్టు విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

డర్బన్‌

యువ భారత్‌కు పరీక్ష. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి పోరులో టీమ్‌ఇండియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. గాయంతో కెప్టెన్‌ హార్దిక్‌ దూరం కావడం, బుమ్రా విశ్రాంతి తీసుకోవడం.. జూన్‌లో ప్రపంచకప్‌ నేపథ్యంలో రోహిత్‌, కోహ్లిల టీ20 భవిష్యత్తుపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో భారత జట్టు విజయాన్ని కానీ, వైఫల్యాన్ని కానీ మరీ ఎక్కువ సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్లపై ఐపీఎల్‌ తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశముంది. ఆ సమయంలో ఫామ్‌, ఫిట్‌నిస్సే జట్టు ఎంపికలో కీలకమవుతుంది. ఒకవేళ రోహిత్‌, కోహ్లి జట్టులోకి వస్తే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న జట్టుకు ప్రపంచకప్‌ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే సత్తా చాటుకోవడానికి ఈ పర్యటన భారత కుర్రాళ్లకు చక్కని అవకాశమనడంలో సందేహం లేదు.
ఉత్సాహంతో..: సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో 4-1తో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌ ఉత్సాహంతో ఉంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు అనుకూలించే పరిస్థితుల్లో ఆ జట్టును ఓడించాలంటే భారత్‌ కష్టపడాల్సిందే. ముఖ్యంగా బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం. యశస్వి జైస్వాల్‌ భవిష్యత్తు స్టార్‌గా ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించాడు. శుభ్‌మన్‌ విశ్రాంతి తీసుకోవడంతో ఆసీస్‌తో సిరీస్‌లో అతడితో కలిసి రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇప్పుడు గిల్‌ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో అతడి పరిస్థితేంటన్నది ప్రశ్న. జైస్వాల్‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు మెండు. మూడో స్థానంలో శ్రేయస్‌.. ఆ తర్వాత సుర్యకుమార్‌, రింకు, జితేశ్‌ శర్మలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. స్వదేశంలో ఫినిషర్‌గా ఆకట్టుకున్న రింకు ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణిస్తాడో చూడాలి. దీపక్‌ చాహర్‌, సిరాజ్‌లకు తోడుగా మూడో పేసర్‌ స్థానం కోసం అర్ష్‌దీప్‌, ముకేశ్‌ల మధ్య పోటీ ఉంది. ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌.. జడేజాతో కలిసి స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. మరోవైపు మార్‌క్రమ్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కూడా చాలా మంది కుర్రాళ్లతో సిరీస్‌కు సిద్ధమైంది. ప్రధాన పేసర్‌ కాగిసో రబాడకు విశ్రాంతినిచ్చినా, గాయాలతో నోకియా, ఎంగిడి దూరమైనా.. సొంతగడ్డపై సఫారీ పేసర్లతో భారత బ్యాటర్లకు సవాలు తప్పదు. పేసర్‌ నంద్రీ బర్గర్‌ అరంగేట్రం చేసే అవకాశముంది.


పిచ్‌

ఏడాది ఇక్కడ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 190 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం కురిసే జల్లుల వల్ల పిచ్‌ నుంచి ఫాస్ట్‌బౌలర్లకు సహకారం లభించవచ్చు. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు తక్కువే.


2

దక్షిణాఫ్రికాతో ఆడిన గత నాలుగు టీ20 సిరీస్‌ల్లో భారత్‌ గెలిచినవి. మిగతా రెండు డ్రాగా ముగిశాయి.


8

డర్బన్‌లో జరిగిన  19 టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచినవి. ఛేదనలోనూ జట్లు అన్నే మ్యాచ్‌లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌ టై కాగా.. రెండు రద్దయ్యాయి. ఇక్కడ టాస్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు.


తుది జట్లు (అంచనా)... భారత్‌: యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, జడేజా, దీపక్‌ చాహర్‌, రవి బిష్ణోయ్‌/కుల్‌దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, ముకేశ్‌.

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్‌, బ్రీజ్కీ, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెరీరా, జాన్సన్‌, కేశవ్‌ మహరాజ్‌, కొయెట్జీ, నంద్రీ బర్గర్‌, షంసి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని