Shubman Gill: ఎట్టకేలకు కొట్టాడు..

రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత కొండంత బరువు దిగిపోయినట్లు, ఎంతో ఉపశమనం పొందినట్లు శుభ్‌మన్‌ గిల్‌ కనిపించాడు.

Updated : 05 Feb 2024 04:16 IST

గిల్‌ శతకం

ఈనాడు క్రీడావిభాగం 

రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత కొండంత బరువు దిగిపోయినట్లు, ఎంతో ఉపశమనం పొందినట్లు శుభ్‌మన్‌ గిల్‌ కనిపించాడు. అవును.. ఈ శతకం అతనికెంతో అవసరం. జట్టులో చోటుపై ప్రశ్నలు రేకెత్తుతున్న సమయంలో, వరుస వైఫల్యాలతో సతమవుతున్న తరుణంలో ఇది అతని కెరీర్‌కు ఊతమిచ్చేదే. ఈ 24 ఏళ్ల యువ ఆటగాడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. వన్డేల్లో గిల్‌కు తిరుగులేదు. కానీ టెస్టులకు వచ్చే సరికి మాత్రం తడబడుతున్నాడు. సెంచరీల సంగతి పక్కనపెడితే.. గత 12 ఇన్నింగ్స్‌ల్లో కనీసం 50 పరుగులూ చేయలేదు. చివరగా నిరుడు మార్చిలో ఆస్ట్రేలియాపై ఓపెనర్‌గా టెస్టు సెంచరీ చేశాడు. మూడో స్థానంలోకి వెళ్లినప్పటి నుంచి ప్రదర్శన మరింత తీసికట్టుగా మారింది. పుజారా స్థానాన్ని భర్తీ చేయడంలో విఫలమవుతున్నాడని, వరుస అవకాశాలిచ్చినా వృథా చేస్తున్నాడని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ టెస్టుకు ముందు 21 మ్యాచ్‌ల్లో 29.52 సగటుతో 1063 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సహా 874 పరుగులు చేశాడు. మూడో స్థానంలో 6 మ్యాచ్‌ల్లో కేవలం 189 పరుగులే సాధించాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ గిల్‌కు అత్యంత కీలకంగా మారింది. ఇందులో రాణించకపోతే వేటు తప్పని పరిస్థితుల్లో అతను నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో అద్భుత శతకంతో గిల్‌ జట్టును ఆదుకున్నాడు. ఎక్కువ మంది బ్యాటర్లు విఫలమైన వేళ.. ఆపద్బాంధవుడిలా మారాడు. అతనాడిన ఈ ఇన్నింగ్స్‌ ఎంతో అమూల్యమైంది. గిల్‌ శతకమే లేకపోయి ఉంటే భారత్‌ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగేదే కాదు. శ్రేయస్‌తో 81, అక్షర్‌తో 89 పరుగుల భాగస్వామ్యాలతో అతడు.. జట్టును శాసించే స్థితికి చేర్చాడు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన అతడు.. పూర్తి నియంత్రణతో కనిపించాడు. ఆరంభంలో అండర్సన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ కాల్‌తో, హార్ట్‌లీ ఓవర్లో సమీక్షతో బతికిపోయాడు. గిల్‌ క్యాచ్‌ స్లిప్‌లో రూట్‌ చేతి కింద నుంచి వెళ్లింది. ఇలాంటి ప్రారంభం తర్వాత గిల్‌ బలంగా నిలబడ్డాడు. బ్యాటింగ్‌కు పరిస్థితులు కష్టంగా మారుతున్నా, తనపై మంచి రికార్డున్న అండర్సన్‌ బంతి బంతికీ పరీక్షించినా, స్పిన్‌ త్రయం ముప్పేట దాడి చేసినా.. గిల్‌ చెదరలేదు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించి, క్రమంగా జోరందుకున్నాడు. చాలా సులువుగా గేర్లు మార్చాడు. 16.2 ఓవర్లలో 50/2తో ఉన్న జట్టు.. 25.3 ఓవర్లలో 102/2తో నిలిచిందంటే అందుకు గిల్‌ దూకుడే కారణం. మరీ జాగ్రత్తగా ఆడితే లాభం లేదని క్రీజులో కుదురుకున్న తర్వాత చెలరేగాడు. స్పిన్నర్లను, ముఖ్యంగా రెహాన్‌ను లక్ష్యంగా చేసుకుని షాట్లు ఆడాడు. స్వల్ప వ్యవధిలో శ్రేయస్‌, రజత్‌ ఔటవడంతో గిల్‌ సంయమనం ప్రదర్శించాడు. ఇన్నింగ్స్‌ నిర్మించడంపై మరింత దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే మూడో స్థానంలో తొలి టెస్టు శతకాన్ని దక్కించుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని