ఎవరా 15!.. నేడు సెలక్షన్‌ కమిటీ సమావేశం

టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు.

Updated : 30 Apr 2024 08:41 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. ధనాధన్‌ టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు అయిన నేపథ్యంలో వచ్చే కొన్ని గంటల్లో ఎప్పుడైనా బీసీసీఐ ఆ 15 మంది ఎవరో వెల్లడించనుంది. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోసం కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ఐపీఎల్‌ ప్రదర్శన లెక్కలోకి రాదు: టీమ్‌ఇండియాను ఎంపిక చేసేందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ఆదివారం రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. మంగళవారం అహ్మదాబాద్‌లో సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల వల్ల బోర్డు కార్యదర్శి జై షా తీరిక లేకుండా ఉండటంతో సెలక్షన్‌ కమిటీ సమావేశాన్ని ఈసారి అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ కోసం వెస్టిండీస్‌-అమెరికాకు వెళ్లే ఆ 15 మంది ఎవరనేది ఇప్పటికే ఖరారైందని తెలుస్తోంది. ఐపీఎల్‌ ఆధారంగా కాకుండా మొత్తం ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంచుకోనున్నారు! ఐపీఎల్‌లో పరుగుల వరదకు కారణమవుతున్న పిచ్‌లకు పూర్తి భిన్నంగా వెస్టిండీస్‌లో పిచ్‌లు మందకొడిగా ఉండే అవకాశాలున్నందున.. లీగ్‌లో టాప్‌ స్కోరర్లలో, పతాక శీర్షికల్లో నిలుస్తున్న వారిలో కొందరికి జట్టులో చోటు దక్కకపోవచ్చు. విరాట్‌ కోహ్లి.. కెరీర్‌లో ఆరో టీ20 ప్రపంచకప్‌ ఆడనున్నాడు. మెగా టోర్నీ కోసం భారత తొలి బృందం మే 21న బయల్దేరనుంది.

బ్యాకప్‌ కీపర్‌ ఎవరో..: బ్యాకప్‌ ఓపెనర్‌, బ్యాకప్‌ వికెట్‌కీపర్‌ ఎంపికే సెలక్షన్‌ కమిటీకి పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఓపెనర్‌ డైలమా మరీ పెద్దదేమీ కాదు. రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం ఖాయం. దీంతో శుభ్‌మన్‌ గిల్‌కు దారులు మూసుకుపోయినట్లయింది. ఒకవేళ గిల్‌ను తీసుకోవాలనుకుంటే.. రింకు లేదా శివమ్‌ దూబెలలో ఎవరిని ఎంచుకోవాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. గిల్‌ను ఎంపిక చేస్తే పోటీలో ఉన్న వారికి అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ జైస్వాల్‌కు గాయమైతే కోహ్లి ఓపెనర్‌గా మారతాడు. కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపికయ్యే అవకాశాలు మెండు. బ్యాకప్‌ కీపర్‌ స్థానం కోసం రాహుల్‌, సంజు శాంసన్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. 21 ఏళ్ల మయాంక్‌ యాదవ్‌ తన పేస్‌తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని అతణ్ని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని