కోల్‌కతా కుమ్మేసింది

కోల్‌కతా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. వరుణ్‌, అరోరా, హర్షిత్‌ సూపర్‌ బౌలింగ్‌తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్‌రైడర్స్‌.. సాల్ట్‌ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

Updated : 30 Apr 2024 06:42 IST

చెలరేగిన సాల్ట్‌
దిల్లీపై ఘనవిజయం
విజృంభించిన వరుణ్‌
కోల్‌కతా

కోల్‌కతా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. వరుణ్‌, అరోరా, హర్షిత్‌ సూపర్‌ బౌలింగ్‌తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్‌రైడర్స్‌.. సాల్ట్‌ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్‌కతా.. ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. 11 మ్యాచ్‌ల్లో దిల్లీకి ఇది ఆరో పరాజయం.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దిల్లీని చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటుతో దిల్లీ తేలిపోయింది. వరుణ్‌ చక్రవర్తి (3/16), హర్షిత్‌ రాణా (2/28), వైభవ్‌ అరోరా (2/29), సునీల్‌ నరైన్‌ (1/24) ధాటికి 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (35 నాటౌట్‌; 26 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఫిల్‌ సాల్ట్‌ (68; 33 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (33 నాటౌట్‌; 23 బంతుల్లో 3×4, 1×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (26 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.

సాల్ట్‌ ధనాధన్‌: స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఎదురేలేదు. ఓపెనర్‌ సాల్ట్‌ చెలరేగడంతో దిల్లీ ఏమాత్రం పోటీలో నిలవలేకపోయింది. నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సాల్ట్‌.. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చాలా ముందే కోల్‌కతా విజయాన్ని ఖాయం చేశాడు. తొలి బంతి నుంచే మొదలైంది సాల్ట్‌ జోరు. సాల్ట్‌ రెండు ఫోర్లు, సిక్స్‌.. నరైన్‌ ఓ ఫోర్‌ బాదడంతో ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో విలియమ్స్‌ 23 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి తర్వాతి ఓవర్లో సాల్ట్‌ వరుసగా మరో రెండు సిక్స్‌లు దంచేశాడు. ఖలీల్‌ ఓవర్లో మరింత రెచ్చిపోయిన సాల్ట్‌.. మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 79/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అక్షర్‌ పటేల్‌ (2/25) వరుస ఓవర్లలో నరైన్‌ (15), సాల్ట్‌ ఔటైనా, రింకు (11) కూడా ఎక్కువసేపు నిలవకున్నా.. చేయాల్సిన స్కోరు ఎక్కువేమీ లేకపోవడంతో కోల్‌కతాకు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా, ప్రశాంతంగా పని పూర్తి చేశారు. ఈ జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 57 పరుగులు జోడించింది.

దిల్లీకి కళ్లెం: దిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుపులే లేవు. ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ ఊపందుకోలేదు. బ్యాటర్లెవరూ నిలబడలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో ఒక్క మంచి భాగస్వామ్యమూ నమోదు కాలేదు. టెయిలెండర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతడి పుణ్యమా అని దిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. దిల్లీ ఆరంభమే పేలవం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు.. వైభవ్‌ అరోరా ధాటికి 4 ఓవర్లయినా కాకముందే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఓపెనర్‌ పృథ్వీ షా (13) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి నిరాశపరిచాడు. రెండో ఓవర్లో అరోరా అతణ్ని వెనక్కి పంపాడు. గత మ్యాచ్‌ హీరో జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (12) కూడా ఈసారి త్వరగా పెవిలియన్‌ చేరాడు. అతణ్ని స్టార్క్‌ ఔట్‌ చేయగా.. హోప్‌ (6)ను అరోరా బౌల్డ్‌ చేశాడు. హర్షిత్‌ రాణా ఓవర్లో వరుసగా 4, 6, 4తో అభిషేక్‌ పోరెల్‌ (18) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతడి జోరు కాసేపే. ఏడో ఓవర్లో హర్షిత్‌ అతణ్ని ఔట్‌ చేయడంతో దిల్లీ 68/4తో నిలిచింది. ఆ దశలో ఆశలన్నీ కెప్టెన్‌ పంత్‌ పైనే. రెండు సిక్స్‌లు, ఫోర్‌తో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన అతడు కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఓ తేలికైన క్యాచ్‌ను హర్షిత్‌ చేజార్చినా.. అవకాశాన్ని పంత్‌ (27) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 11వ ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్‌కు చిక్కి అతడు వెనుదిరిగాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కొనసాగించిన వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌ బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. పరుగులు చాలా కష్టంగా వచ్చాయి. 12 నుంచి 15 ఓవర్ల మధ్య 16 పరుగులే చేసిన దిల్లీ.. స్టబ్స్‌ (4), అక్షర్‌ పటేల్‌ (15), కుశాగ్ర (1) వికెట్లను కోల్పోయి 112/8తో నిలిచింది. ఆ దశలో దిల్లీ 150 దాటలేదనిపించింది. కానీ కుల్‌దీప్‌ కాస్త బ్యాట్‌ ఝళిపించడంతో ఆఖరి అయిదు ఓవర్లలో ఆ జట్టుకు 41 పరుగులొచ్చాయి. రసిఖ్‌ సలామ్‌ (8)తో 9వ వికెట్‌కు కుల్‌దీప్‌ 29 పరుగులు జోడించాడు.

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) సాల్ట్‌ (బి) అరోరా 13; జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (సి) వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) స్టార్క్‌ 12; అభిషేక్‌ పోరెల్‌ (బి) హర్షిత్‌ రాణా 18; షై హోప్‌ (బి) అరోరా 6; పంత్‌ (సి) శ్రేయస్‌ (బి) వరుణ్‌ 27; అక్షర్‌ పటేల్‌ (బి) నరైన్‌ 15; స్టబ్స్‌ (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 4; కుమార్‌ కుశాగ్ర (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 1; కుల్‌దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 35; రసిఖ్‌ సలామ్‌ (సి) శ్రేయస్‌ (బి) హర్షిత్‌ 8; లిజాడ్‌ విలియమ్స్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153; వికెట్ల పతనం: 1-17, 2-30, 3-37, 4-68, 5-93, 6-99, 7-101, 8-111, 9-140; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-43-1; వైభవ్‌ అరోరా 4-0-29-2; హర్షిత్‌ రాణా 4-0-28-2; నరైన్‌ 4-0-24-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-16-3; రసెల్‌ 1-0-10-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) అక్షర్‌ 68; నరైన్‌ (సి) మెక్‌గుర్క్‌ (బి) అక్షర్‌ 15; రింకు సింగ్‌ (సి) కుల్‌దీప్‌ (బి) విలియమ్స్‌ 11; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 33; వెంకటేశ్‌ అయ్యర్‌ నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-79, 2-96, 3-100; బౌలింగ్‌: లిజాడ్‌ విలియమ్స్‌ 3-0-38-1; ఖలీల్‌ అహ్మద్‌ 3-0-28-0; రసిఖ్‌ సలామ్‌ 2.3-0-30-0; అక్షర్‌ పటేల్‌ 4-0-25-2; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-34-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని