Updated : 28/11/2021 06:49 IST

IND vs NZ: అక్షర్‌ తిప్పేశాడు

న్యూజిలాండ్‌ 296 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 14/1

కాన్పూర్‌

197/1.. మూడో రోజు ఆటలో ఓ దశలోన్యూజిలాండ్‌ స్కోరిది. ఇక మ్యాచ్‌ను శాసించవచ్చని ఆ జట్టు భావించి ఉంటుంది. కానీ రోజు ముగిసేసరికి టీమ్‌ఇండియాదే పైచేయి. అక్షర్‌ పటేల్‌ విజృంభించిన వేళ కివీస్‌ను చుట్టేసి బలంగా పుంజుకున్న భారత్‌.. కాన్పూర్‌ టెస్టుపై పట్టుబిగిస్తోంది. ఆధిక్యం స్వల్పమే కానీ.. బంతి తక్కువ ఎత్తులో వస్తున్న పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం న్యూజిలాండ్‌కు చాలా కష్టమే. భారత్‌ 300 లక్ష్యాన్ని నిర్దేశిస్తే మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే.

బంతితో మాయ చేసిన టీమ్‌ఇండియా తొలి టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచింది. స్పిన్‌కు మరింతగా సహకరించనున్న పిచ్‌పై మొత్తంగా 63 పరుగుల ఆధిక్యంలో భారత్‌కు 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడో రోజు 129/0తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ ఓ దశలో భారీ స్కోరు దిశగా సాగినా... అక్షర్‌ పటేల్‌ (5/62), అశ్విన్‌ (3/82) స్పిన్‌కు చిక్కి 296 పరుగులకు ఆలౌటైంది. లేథమ్‌ (95) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (89)తో తొలి వికెట్‌కు అతడు 151 పరుగులు జోడించాడు. వీళ్లిద్దరి తర్వాత జేమీసన్‌ (23) టాప్‌ స్కోరర్‌. 49 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (4), పుజారా (9) క్రీజులో ఉన్నారు. గిల్‌ (1) ఔటైనా.. భారత్‌దే పైచేయి అనడంలో సందేహం లేదు. జేమీసన్‌ మరోసారి గిల్‌ను బౌల్డ్‌ చేశాడు. నాలుగో రోజు నిర్ణయాత్మకం కానుంది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కూడా న్యూజిలాండ్‌కు చాలా కష్టమవుతుందని భావిస్తున్నారు.

కివీస్‌కు కళ్లెం: మూడో రోజు న్యూజిలాండ్‌ ఆట చూస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించేలా కనిపించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 129/0తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు ఓ దశలో 197/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ భారీ స్కోరుపై కన్నేసిన ఆ జట్టును దెబ్బతీసి భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపారు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌. వీళ్ల ధాటికి న్యూజిలాండ్‌ 99 పరుగులకే తన చివరి 9 వికెట్లు చేజార్చుకుంది. ముఖ్యంగా అక్షర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బంతి చాలా తక్కువగా లేస్తున్న పిచ్‌పై టర్న్‌ను ఉపయోగించుకుంటూ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసిన అతడు.. ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అయిదు వికెట్ల ఘనత సాధించడం మూడున్నర టెస్టుల్లో అతడికిది అయిదోసారి కావడం విశేషం. అయితే అన్నింట్లో ఈ ప్రదర్శనే అతడికి ఎక్కువ సంతోషాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పిచ్‌లలా కాన్పూర్‌ పిచ్‌ స్పిన్‌కు విపరీతంగా ఏమీ సహకరించట్లేదు. బ్యాటింగ్‌ చేయడం మరీ అంత కష్టంగానూ లేదు. ఉదయం ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ లేథమ్‌, యంగ్‌ ఏకాగ్రతతో బ్యాటింగ్‌ను కొనసాగించారు. ఇషాంత్‌, అశ్విన్‌లతో భారత జట్టు బౌలింగ్‌ను దాడిని ఆరంభించింది. అయితే కివీస్‌ ఓపెనర్లు వారి బౌలింగ్‌లో అంత తేలిగ్గా పరుగులు చేయలేకపోయారు. గతి తప్పే బంతులకు కోసం ఎదురు చూశారు. కొన్నిసార్లు బంతులు ఎడ్జ్‌కు తాకి వెళ్లినా క్యాచ్‌లు లేవలేదు. అయితే ఎంతకీ వికెట్‌ దక్కకపోవడంతో ఆరౌండ్‌ద వికెట్‌ నుంచి ఓవర్‌ ద వికెట్‌కు మారిన అశ్విన్‌ ఫలితం రాబట్టాడు. యంగ్‌ను ఔట్‌ చేయడం ద్వారా తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వికెట్‌కీపర్‌ భరత్‌ అందుకున్న చురుకైన క్యాచ్‌కు యంగ్‌ నిష్క్రమించాడు. లేథమ్‌ కూడా అశ్విన్‌కు చిక్కాల్సింది. ఎల్బీ అప్పీలును అంపైర్‌ నితిన్‌ తిరస్కరించగా.. భారత్‌ కూడా సమీక్ష కోరలేదు. కోరి ఉంటే వికెట్‌ దక్కేది. అవకాశాన్ని ఉపయోగించుకున్న లేథమ్‌.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (18)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే భాగస్వామ్యం బలపడుతున్న దశలో కివీస్‌ను ఉమేశ్‌ యాదవ్‌ దెబ్బతీశాడు. లంచ్‌కు కాసేపు ముందు రెండో కొత్త బంతితో అతడు విలియమ్సన్‌ను   ఇన్‌కటర్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతే.. మ్యాచ్‌పై భారత్‌ పట్టు సంపాదించింది. తర్వాతి రెండు సెషన్లూ భారత్‌వే. అక్షర్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని న్యూజిలాండ్‌ విలవిల్లాడింది. ఓపిగ్గా బౌలింగ్‌ చేసిన అతడు ఫలితం రాబట్టాడు. రెండో రోజు సాయంత్రంతో పోలిస్తే వేగాన్ని పెంచిన అతడు.. టేలర్‌ (11)ను ఔట్‌ చేయడం ద్వారా తన తొలి వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఫ్రంట్‌ఫుట్‌పై డిఫెన్స్‌ ఆడబోయిన టేలర్‌.. భరత్‌కు చిక్కాడు. అక్షర్‌ తన తర్వాతి ఓవర్లో నికోల్స్‌ (2)ను వెనక్కి పంపాడు. ఓ ఫులర్‌ డెలివరీని స్వీప్‌ చేయబోయిన నికోల్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అక్షర్‌ కాసేపటి తర్వాత లేథమ్‌నూ ఔట్‌ చేశాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని లేథమ్‌ ముందుకొచ్చి డిఫెండ్‌ ఆడబోయి గురి తప్పగా.. భరత్‌ చురుగ్గా స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఈ మూడు వికెట్లను అక్షర్‌ 13  పరుగుల వ్యవధిలోనే పడగొట్టడం విశేషం. లేథమ్‌ అయిదో వికెట్‌గా నిష్క్రమించేటప్పటికి స్కోరు 227. ఆ తర్వాత రచిన్‌ రవీంద్ర (13)ను జడేజా ఔట్‌ చేయగా.. వికెట్‌కీపర్‌ బ్లండెల్‌ (94 బంతుల్లో 13), సౌథీ (5)ను ఔట్‌ చేయడం ద్వారా అక్షర్‌ అయిదు వికెట్ల ఘనతను పూర్తి చేశాడు. జేమీసన్‌ (23; 75 బంతుల్లో 1×4), సోమర్‌విలే (52 బంతుల్లో 6)లను వెనక్కి పంపి కివీస్‌ ఇన్నింగ్స్‌కు అశ్విన్‌ తెరదించాడు. ఎక్కువ పరుగులేమీ ఇవ్వకపోయినా చివరి వికెట్లు భారత్‌కు అంత త్వరగా దక్కలేదు. బ్లండెల్‌, జేమీసన్‌, సోమర్‌విలే ఎక్కువ బంతులాడి భారత బౌలర్లను అసహనానికి గురి చేశారు.


‘‘ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ లేదా భారత్‌-ఎ జట్లకు ఆడినప్పుడు మెరుగైన ప్రదర్శన చేశా. నన్ను నేనెప్పుడూ వైట్‌బాల్‌ స్పెషలిస్ట్‌గా పరిగణించుకోలేదు. నా సహచరులు నాపై విశ్వాసం ఉంచారు. వాళ్ల అంచనాలను అందుకోగలుగుతున్నా. నేనెప్పుడు మైదానంలోకి దిగినా బౌలింగ్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తా. అశ్విన్‌ భాయ్‌, జడ్డూ భాయ్‌ ఉన్నారా లేదా అని ఆలోచించను. పిచ్‌ ఎలా స్పందిస్తుందో చూసి అందుకు తగినట్లు వ్యూహ రచన చేసుకుంటా’’

- అక్షర్‌ పటేల్‌


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లేథమ్‌ (స్టంప్డ్‌) భరత్‌ (బి) అక్షర్‌ 95; విల్‌ యంగ్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 89; విలియమ్సన్‌ ఎల్బీ (బి) ఉమేశ్‌ 18; రాస్‌ టేలర్‌ (సి) భరత్‌ (బి) అక్షర్‌ 11; నికోల్స్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 2; బ్లండెల్‌ (బి) అక్షర్‌ 13; రచిన్‌ రవీంద్ర (బి) జడేజా 13; జేమీసన్‌ (సి) అక్షర్‌(బి) అశ్విన్‌ 23; సౌథీ (బి) అక్షర్‌ 5; సోమర్‌విలే (బి) అశ్విన్‌ 6; అజాజ్‌ పటేల్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (142.3 ఓవర్లలో ఆలౌట్‌) 296; వికెట్ల పతనం: 1-151, 2-197, 3-214, 4-218, 5-227, 6-241, 7-258, 8-270, 9-284; బౌలింగ్‌: ఇషాంత్‌ 15-5-35-0; ఉమేశ్‌ యాదవ్‌ 18-3-50-1; అశ్విన్‌ 42.3-10-82-3; జడేజా 33-10-57-1; అక్షర్‌ పటేల్‌ 34-6-62-5

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ బ్యాటింగ్‌ 4; శుభ్‌మన్‌ (బి) జేమీసన్‌ 1; పుజారా బ్యాటింగ్‌ 9; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 14; వికెట్ల పతనం: 1-2 బౌలింగ్‌: సౌథీ 2-1-2-0; జేమీసన్‌ 2-0-8-1; అజాజ్‌ పటేల్‌ 1-0-4-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని