టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోతానంటే.. వాళ్లొద్దనలేదు

టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవాలన్న తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని బీసీసీఐ తననెప్పుడూ కోరలేదని టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించే టెస్టు జట్టు ఎంపికకు గంటన్నర ముందు మాత్రమే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నాడు. కొత్త పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు బయల్దేరనున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కోహ్లి చెప్పాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపాడు.

Updated : 16 Dec 2021 06:42 IST

వన్డే సారథ్యం నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందు చెప్పారు

ముంబయి

టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవాలన్న తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని బీసీసీఐ తననెప్పుడూ కోరలేదని టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించే టెస్టు జట్టు ఎంపికకు గంటన్నర ముందు మాత్రమే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నాడు. కొత్త పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు బయల్దేరనున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కోహ్లి చెప్పాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపాడు. ‘‘కెప్టెన్సీపై నిర్ణయానికి సంబంధించి బీసీసీఐ నాతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు సరికాదు’’ అని అన్నాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని, పరిమిత ఓవర్ల క్రికెట్లో భిన్న సారథ్యం బాగుండదని బోర్డు కోహ్లీతో చెప్పిందని అధ్యక్షుడు గంగూలీ చెప్పడాన్ని దృష్టిలో ఉంచుకుని అతడు ఈ వ్యాఖ్యలు చేశాడని అర్థమవుతోంది.

అలా జరిగింది..: ‘‘టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు నాతో మాట్లాడారు. అంతకుముందు.. అంటే నేను టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత నాతో ఎవరూ మాట్లాడలేదు. సెలక్టర్లు టెస్టు జట్టు ఎంపికపై నాతో చర్చించారు. కాల్‌ ముగియడానికి ముందు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారు. అందుకు నేను ‘మంచిది’ అని బదులిచ్చా’’ అని కోహ్లి చెప్పాడు. తర్వాతి ప్రశ్న అడిగినప్పుడే.. బీసీసీఐకి, అతడికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. మరి మీరు 2023 ప్రపంచకప్‌ వరకు వన్డే కెప్టెన్‌గా ఉంటానన్నారుగా అన్న ప్రశ్నకు అతడు.. ‘ఇది ప్రశ్నా’ అని అంటూ అతడు నవ్వగా.. ‘‘అవును.. ఇది ప్రశ్నే, ఎందుకంటే వన్డే కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటున్నానని మీరే చెప్పారు’’ అని విలేకరి అన్నాడు. అప్పుడు కోహ్లి స్పందిస్తూ.. ‘‘నేను టీ20 కెప్టెన్‌గా వైదొలగానుకున్నప్పుడు బీసీసీఐని సంప్రదించా. నా నిర్ణయం గురించి వారికి (బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌) చెప్పా. అందుకు నా కారణాలను వివరించా. వాళ్లేమీ అభ్యంతరం చెప్పలేదు. ఒక్కసారి కూడా ‘నువ్వు టీ20 కెప్టెన్సీని వదిలేయొద్దు’ అని చెప్పలేదు. పైగా నాది ప్రగతిశీల నిర్ణయమని అన్నారు’’ అని కోహ్లి చెప్పాడు. గంగూలీ చెప్పినదానికి ఇది పూర్తి విరుద్ధం. టెస్టు, వన్డే కెప్టెన్‌ కొనసాగాలని అనుకుంటున్నట్లు కూడా బీసీసీఐతో చెప్పినట్లు కోహ్లి తెలిపాడు. టీ20 కెప్టెన్సీని వదిలేయడంపై పునరాలోచన చేయకూడదని కోహ్లి నిర్ణయించుకోవడంతో సెలక్టర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇంతకుముందు చెప్పాడు. ‘‘టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని మేం కోహ్లీతో చెప్పాం. కానీ కొనసాగనని అతడు అన్నాడు. ఈ నేపథ్యంలో.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని సెలక్టర్లు భావించారు’’ అని అన్నాడు.

రోహిత్‌ సమర్థుడు

టీ20, వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సమర్థుడైన నాయకుడని, అతడికి తన పూర్తి మద్దతు ఉంటుందని కోహ్లి చెప్పాడు. రోహిత్‌ నాయకత్వంలో మీ పాత్ర ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘జట్టు సరైన దిశలో వెళ్లేలా చేయడమే నా బాధ్యత. కెప్టెన్‌ కాకముందు కూడా ఆ పని చేశా. ఆ ఆలోచనా సరళి ఎప్పటికీ మారదు. రోహిత్‌ చాలా సమర్థుడైన కెప్టెన్‌. వ్యూహ రచనలో దిట్ట. అతడు భారత్‌కు నాయకత్వం వహించిన మ్యాచ్‌ల్లో, ఐపీఎల్‌లో అది చూశాం. అలాగే ద్రవిడ్‌ బాయ్‌ కూడా సమర్థుడైన కోచ్‌. ఎవరితో ఎలా వ్యవహరించాలో అతడికి బాగా తెలుసు. వాళ్లిద్దరికీ నా మద్దతు ఉంటుంది. జట్టు కోసం వాళ్లేం చేసినా నేను నూరు శాతం సహకరిస్తా’’ అని అన్నాడు. తనకు, రోహిత్‌కు మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలను అతడు కొట్టిపారేశాడు. ‘‘ఈ విషయంపై ఇంతకుముందు కూడా వివరణ ఇచ్చా. ఇలా వివరణ ఇచ్చీ ఇచ్చీ అలసిపోయా. నేను క్రికెట్‌ ఆడినంత కాలం నా చర్యల వల్ల జట్టుకు నష్టం వాటిల్లదని కచ్చితంగా చెబుతున్నా. అది భారత క్రికెట్‌ పట్ల నాకున్న అంకితభావం’’ అని కోహ్లి చెప్పాడు. బీసీసీఐ మిమ్మల్ని వన్డే కెప్టెన్‌గా ఎందుకు తప్పించిందని భావిస్తున్నారు అని అడిగినప్పుడు.. ‘‘కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మేం ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాం. వాళ్ల నిర్ణయం తప్పయినా...  ఒప్పయినా చర్చ అనవసరం’’ అని అన్నాడు.

దక్షిణాఫ్రికాతో వన్డేల్లో ఆడతా..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలను కోహ్లి కొట్టిపారేశాడు. ఆ సిరీస్‌లో తాను ఆడతానని స్పష్టం చేశాడు. ‘‘నేను దక్షిణాఫ్రికాతో వన్డేలకు అందుబాటులో ఉన్నా. విశ్రాంతి కావాలని నేను బీసీసీఐని కోరలేదు. నేను ఆడనంటూ వచ్చిన వార్తలు అబద్ధాలు’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని