IND vs SA : విరాట్‌ ఒక్కడే..

దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమ్‌ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. మరోసారి భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ లేమిని అధిగమిస్తూ, కొత్త ఏడాదిలో కొత్త ఆశలురేకెత్తిస్తూ చక్కని ఇన్నింగ్స్‌ ఆడినా.. భారత్‌ 223 పరుగులకే సరిపెట్టుకుంది. పేసర్లు విజృంభించడంతో తొలి రోజు దక్షిణాఫ్రికాదే పైచేయి. ఓ దశలో కాస్త మెరుగైన స్కోరే చేసేలా కనిపించిన భారత్‌.. చివరి సెషన్లో 82 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని నిరాశపరిచింది.

Updated : 12 Jan 2022 12:55 IST

రాణించిన కెప్టెన్‌

223కే భారత్‌ కట్టడి

విజృంభించిన రబాడ, జాన్సన్‌

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు

దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమ్‌ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. మరోసారి భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ లేమిని అధిగమిస్తూ, కొత్త ఏడాదిలో కొత్త ఆశలు రేకెత్తిస్తూ చక్కని ఇన్నింగ్స్‌ ఆడినా.. భారత్‌ 223 పరుగులకే సరిపెట్టుకుంది. పేసర్లు విజృంభించడంతో తొలి రోజు దక్షిణాఫ్రికాదే పైచేయి. ఓ దశలో కాస్త మెరుగైన స్కోరే చేసేలా కనిపించిన భారత్‌.. చివరి సెషన్లో 82 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని నిరాశపరిచింది.

కేప్‌టౌన్‌

క్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలుచుకోవాలని ఉబలాటపడుతున్న భారత్‌.. మూడో టెస్టులో బ్యాటుతో తడబడింది. మొదటి రోజు, మంగళవారం తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (79; 201 బంతుల్లో 12×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఆ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది పుజారా (43; 77 బంతుల్లో 7×4)నే. రబాడ (4/73), జాన్సన్‌ (3/55) భారత జట్టు పతనాన్ని శాసించారు. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఎల్గర్‌ (3) వికెట్‌ను కోల్పోయి 17 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (8 బ్యాటింగ్‌), కేశవ్‌ మహరాజ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌: తొలి రోజు భారత్‌లో ఆటలో కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్సే హైలైట్‌. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి వడవడిగా వికెట్లు చేజార్చుకున్న టీమ్‌ఇండియా.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అది కోహ్లి చలవే. చాలా సహనంతో బ్యాటింగ్‌ చేసిన అతడు.. చాలా రోజుల తర్వాత కాస్త పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాడు. పుజారా కూడా సౌకర్యంగానే కనిపించినా.. ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు .ఇటీవల కాలంలో మెరుగైన ఆరంభాలిస్తున్న ఓపెనర్లు మాత్రం ఈసారి నిరాశపరిచారు. మబ్బులు పట్టిన వాతావరణంలో, పచ్చిక ఉన్న పిచ్‌పై టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్లు రబాడ, అలివీర్‌ తొలి గంటలో పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకున్నారు. పదునైన పేస్‌తో బ్యాట్స్‌మెన్‌పు పరీక్షించిన వీళ్లు.. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (35 బంతుల్లో 15; 3×4), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 12; 1×4)ను త్వరగా వెనక్కి పంపారు. కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న రబాడ ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో నిలకడగా బంతులేశాడు. మంచి బౌన్స్‌ లభిస్తోన్న పిచ్‌పై అలివీర్‌ బంతులు సర్రున లోపలికి దూసుకొచ్చి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాయి. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా అలివీర్‌ భారత జట్టు పతనాన్ని ఆరంభించాడు. ఎంతో సంయమనంతో బంతులను వదిలేస్తూ వస్తున్న రాహుల్‌ ఈసారి ఆఫ్‌స్టంప్‌పై లేస్తున్న బంతిని ఆడి వికెట్‌కీపర్‌కు చిక్కాడు. మరోవైపు ఖాతా అయినా తెరవకముందే రబాడ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో ఫీల్డర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన మయాంక్‌.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రబాడ బౌలింగ్‌లోనే ఎడ్జ్‌తో రెండో స్లిప్‌లో మార్‌క్రమ్‌కు దొరికిపోయాడు.

మంచి స్థితి నుంచి..: గాయంతో రెండో టెస్టుకు దూరమైన కోహ్లి సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును పుజారాతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే మబ్బుపట్టిన వాతావరణంలో దక్షిణాఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా రబాడ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలిగాడు. ఇటీవల కాలంలో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోవడంతో ఇబ్బందిపడుతున్న కోహ్లి.. కొన్ని చక్కని కవర్‌డ్రైవ్‌లు ఆడాడు. కానీ బంతులు నాలుగో స్టంప్‌ పడ్డప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. తొలి 15 బంతుల్లో ఖాతా తెరవని కోహ్లి.. జాన్సన్‌ బౌలింగ్‌లో కవర్‌డ్రైవ్‌ బౌండరీతో పరుగుల వేట మొదలెట్టాడు. రబాడ బౌలింగ్‌లో ఓ మిస్‌ హిట్‌తో సిక్స్‌ కూడా రాబట్టాడు. అయితే రబాడ ఎంతగా పరీక్షించినా కోహ్లి చాలా వరకు ఓపిగ్గా, క్రమశిక్షణతోనే ఆడాడు. మరోవైపు పుజారా సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేశాడు. గత మ్యాచ్‌లో లాగే కాస్త వేగంగా పరుగులు రాబట్టాడు. గతి తప్పిన బంతులను శిక్షించాడు. లంచ్‌ తర్వాత ఓ దశలో స్కోరు 95/2. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ మంచి నియంత్రణలో కనిపించారు. అయితే ఇన్నింగ్స్‌లో సాఫీగా సాగిపోతున్న దశలో పుజారా నిష్క్రమణ భారత్‌ను దెబ్బతీసింది. పుజారా... జాన్సన్‌ బౌలింగ్‌లో ఎడ్జ్‌తో క్యాచ్‌ ఔటయ్యాడు. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించిన రహానె (9) మరోసారి విఫలమయ్యాడు. రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే పంత్‌ (27; 50 బంతుల్లో 4×4) కాసేపు నిలిచాడు. కోహ్లి, పంత్‌ వీలైనప్పుడల్లా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. కోహ్లి 158 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టీ తర్వాత  ఓ దశలో 167/4తో భారత్‌ మెరుగ్గానే కనిపించింది. కానీ పంత్‌ను ఔట్‌ చేయడం ద్వారా బలపడుతున్న అయిదో వికెట్‌ భాగస్వామ్యాన్ని (51) జాన్సన్‌ విడదీయడంతో మ్యాచ్‌ గమనం పూర్తిగా మారిపోయింది. ఎక్స్‌ట్రా బౌన్స్‌కు పంత్‌ దెబ్బతిన్నాడు. గల్లీ మీదుగా షాట్‌ కొట్టబోయిన అతడు.. ఫీల్డర్‌కు చిక్కాడు. అయితే అదే ఓవర్లో మిడాఫ్‌లో చక్కటి బౌండరీతో కోహ్లి ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు. దూకుడు కూడా పెంచాడు. మరికొన్ని చక్కని బౌండరీలు సాధించాడు. అయితే ఒత్తిడి కొనసాగించిన దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. మరో మెరుగైన భాగస్వామ్యం నమోదు కానివ్వకుండా ఇన్నింగ్స్‌ను చుట్టేశారు. టెయిలెండర్ల నుంచి కోహ్లీకి ఎలాంటి సహకారం లభించలేదు. అశ్విన్‌, శార్దూల్‌, బుమ్రా వెంటవెంటనే వెనుదిరిగారు. రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ వెరీన్‌కు చిక్కిన కోహ్లి.. 9వ వికెట్‌గా నిష్క్రమించాడు షమిని ఎంగిడి ఔట్‌ చేయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 56 పరుగుల వ్యవధిలో భారత్‌ చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వెరీన్‌ (బి) అలివీర్‌ 12; మయాంక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) రబాడ 15; పుజారా (సి) వెరీన్‌ (బి) జాన్సన్‌ 43; కోహ్లి (సి) వెరీన్‌ (బి) రబాడ 79; రహానె (సి) వెరీన్‌ (బి) రబాడ 9; పంత్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సన్‌ 27; అశ్విన్‌ (సి) వెరీన్‌ (బి) జాన్సన్‌ 2; శార్దూల్‌ ఠాకూర్‌ (సి) పీటర్సన్‌ (బి) మహరాజ్‌ 12; బుమ్రా (సి) ఎల్గర్‌ (బి) రబాడ 0; ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 4; షమి (సి) బవుమా (బి) ఎంగిడి 7; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (77.3 ఓవర్లలో ఆలౌట్‌) 223; వికెట్ల పతనం: 1-31, 2-33, 3-95, 4-116, 5-167, 6-175, 7-205, 8-210, 9-211; బౌలింగ్‌: రబాడ 22-4-73-4; అలివీర్‌ 18-5-42-1; జాన్సన్‌ 18-6-55-3; ఎంగిడి 14.3-7-33-1; కేశవ్‌ మహరాజ్‌ 5-2-14-1

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్‌క్రమ్‌ బ్యాటింగ్‌ 8; కేశవ్‌ బ్యాటింగ్‌ 6; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 12; వికెట్ల పతనం: 1-10; బౌలింగ్‌: బుమ్రా 4-4-0-1; ఉమేశ్‌ 2-0-10-0; షమి 2-0-7-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని