IND vs WI: గెలిచేశారు.. కష్టంగా

హమ్మయ్య.. గెలిచేశాం..! కానీ విజయానికి ముందు ఉత్కంఠ ఊపేసింది. ఒక దశలో ఓటమి భయమూ వెంటాడింది! అయితే ఇందులో విండీస్‌ ఘనత కంటే భారత్‌ తప్పిదాలదే ముఖ్య పాత్ర! అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఫీల్డింగ్‌ తప్పిదాలు, బౌలింగ్‌ లోపాలతో పీకల మీదికి తెచ్చుకున్న టీమ్‌ఇండియా

Updated : 19 Feb 2022 06:40 IST

సిరీస్‌ 2-0తో కైవసం
చెలరేగిన పావెల్‌, పూరన్‌
భయపెట్టిన విండీస్‌
ఆఖర్లో బయటపడ్డ భారత్‌
కోల్‌కతా

హమ్మయ్య.. గెలిచేశాం..! కానీ విజయానికి ముందు ఉత్కంఠ ఊపేసింది. ఒక దశలో ఓటమి భయమూ వెంటాడింది! అయితే ఇందులో విండీస్‌ ఘనత కంటే భారత్‌ తప్పిదాలదే ముఖ్య పాత్ర! అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఫీల్డింగ్‌ తప్పిదాలు, బౌలింగ్‌ లోపాలతో పీకల మీదికి తెచ్చుకున్న టీమ్‌ఇండియా.. ఆఖర్లో   ఉత్కంఠభరిత క్షణాల్లో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఒకప్పటి ఆటను గుర్తు చేస్తూ కోహ్లి.. తనదైన శైలిలో చెలరేగుతూ పంత్‌ మెరుపు అర్ధశతకాలతో భారత్‌ కోరుకున్న దాని కంటే ఎక్కువ స్కోరే అందిస్తే.. ఆ తర్వాత ఫీల్డింగ్‌ వైఫల్యాల్ని సొమ్ము చేసుకుంటూ పావెల్‌, పూరన్‌ విండీస్‌ను భారీ లక్ష్యానికి చేరువ చేశారు. కానీ ఆఖర్లో భువి  అద్భుత బౌలింగ్‌ భారత్‌ను గట్టెక్కించింది. సిరీస్‌ విజయాన్నందించింది.

వెస్టిండీస్‌పై ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్‌.. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పంత్‌ (52 నాటౌట్‌; 28 బంతుల్లో 7×4, 1×6), కోహ్లి (52; 41 బంతుల్లో 7×4, 1×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (33; 18 బంతుల్లో 4×4, 1×6) చెలరేగడంతో భారత్‌ 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. అనంతరం రోమన్‌ పావెల్‌ (68 నాటౌట్‌; 36 బంతుల్లో 4×4, 5×6), పూరన్‌ (62; 41 బంతుల్లో 5×4, 3×6) విండీస్‌ను గెలిపిచేందుకు విఫలయత్నం చేశారు. ఆ జట్టు 3 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. ఆఖర్లో భువనేశ్వర్‌ (1/29) కట్టుదిట్టమైన ఓవర్‌తో కరీబియన్‌ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. చాహల్‌ (1/31), రవి బిష్ణోయ్‌ (1/30) పర్వాలేదనిపించారు. నామమాత్రమైన చివరి టీ20 ఆదివారం జరుగుతుంది.

తిట్టుకున్నోడే గెలిపించాడు..: 3 ఓవర్లలో 37 పరుగులు.. విండీస్‌ విజయ సమీకరణమిది. ఓపెనర్లు కింగ్‌ (22), మేయర్స్‌ (9)ల వికెట్లు కోల్పోయి 9 ఓవర్లలో 60/2తో ఉన్న విండీస్‌ ఈ స్థితికి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే తొలి టీ20లో మెరుపు అర్ధశతకం బాదిన పూరన్‌ మరోసారి రెచ్చిపోతే.. గత మ్యాచ్‌లో డకౌటైన రోమన్‌ పావెల్‌ అనూహ్యంగా చెలరేగడంతో చూస్తుండగానే పరిస్థితి మారిపోయింది. ఈ జంట 10-17 మధ్య 8 ఓవర్లలో 90 పరుగులు జోడించి విండీస్‌ను పోటీలోకి తెచ్చింది. వాళ్లున్న ఊపు చూస్తే 3 ఓవర్లలో 37 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అనిపించింది. అయితే హర్షల్‌ 18వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చి వీరికి కాస్త కళ్లెం వేశాడు. తర్వాతి ఓవర్‌ వేయడానికి భువి వచ్చాడు. తన ముందు ఓవర్లో పావెల్‌ రిటర్న్‌ క్యాచ్‌ను వదిలేయడంతో భువిని అభిమానులు తెగ తిట్టుకుంటున్నారు అప్పటికి. కానీ అలా తిట్టుకున్నోడే ఈ ఓవర్‌ అయ్యేసరికి హీరో అయ్యాడు. ఈ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి ప్రమాదకర పూరన్‌ను ఔట్‌ చేశాడు భువి. భారీ షాట్‌కు ప్రయత్నించిన పూరన్‌.. ఎక్స్‌ట్రా కవర్‌లో బిష్ణోయ్‌కు దొరికిపోయాడు. 6 బంతుల్లో 25 పరుగులతో సమీకరణం చాలా కష్టంగా మారిపోయింది. అయినా పావెల్‌, పొలార్డ్‌ క్రీజులో ఉండటంతో ఏమైనా అద్భుతం చేస్తారేమో అన్న భయం. అయితే హర్షల్‌ తొలి రెండు బంతుల్లో 2 పరుగులే ఇచ్చాడు. హమ్మయ్య అనుకుంటే.. పావెల్‌ వరుసగా రెండు సిక్సర్లు బాది ఉత్కంఠ రేపాడు. అయితే అయిదో బంతికి సింగిలే రావడంతో విండీస్‌కు దారులు మూసుకుపోయాయి.

తడబడి.. నిలబడి: మొదట టాస్‌ గెలిచి విండీస్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. సగం వరకు ఆ జట్టు నిర్ణయం సరైందే అనిపించేలా భారత్‌ ఇన్నింగ్స్‌ సాగింది. 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులే చేసిన టీమ్‌ఇండియా.. ప్రత్యర్థికి 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. తొలి టీ20లో మెరుపులు మెరిపించిన రోహిత్‌ (19), కిషన్‌ (2), సూర్యకుమార్‌ (8).. 10 ఓవర్లలోపే పెవిలియన్‌ చేరిపోయారు. మొదటి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన చేజ్‌.. ఈసారి మరింతగా రాణించాడు. భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు. రోహిత్‌, సూర్య, కోహ్లిల కీలక వికెట్లను అతను పడగొట్టాడు. అందులోనూ విరాట్‌ను అతను బౌల్డ్‌ చేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌. కోహ్లి కాస్త ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడబోగా బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్య ఖాళీలో దూసుకెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. అయితే ఔటవడానికి ముందు విరాట్‌ అభిమానులను తనదైన శైలిలో అలరించాడు. పాత కోహ్లిని గుర్తుకు తెస్తూ ఆద్యంతం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసిన అతను.. అలవోకగా భారీ షాట్లు ఆడాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరోవైపు కోహ్లి చెలరేగి ఆడుతుండటంతో స్కోరు వేగం పడిపోలేదు. కిషన్‌ ఆరంభంలోనే కాట్రెల్‌ బౌలింగ్‌లో పేలవ షాట్‌ ఆడి పెవిలియన్‌ చేరగా.. చేజ్‌ బౌలింగ్‌లో షాట్‌ గురి తప్పడంతో రోహిత్‌ వెనుదిరిగాడు. సూర్యకుమార్‌.. చేజ్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో భారత్‌ ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించినా.. కోహ్లి చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతను అర్ధశతకం పూర్తి చేసుకోగానే ఔటైపోయాడు. ఇక భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడినట్లే అనుకుంటే.. వెంకటేశ్‌ అయ్యర్‌తో జత కలిసిన పంత్‌ కథ మార్చేశాడు. ఇద్దరూ పోటీ పడి భారీ షాట్లు ఆడటంతో విండీస్‌ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. ఆ జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంగా సాగడంతో స్కోరు పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) కింగ్‌ (బి) చేజ్‌ 19; కిషన్‌ (సి) మేయర్స్‌ (బి) కాట్రెల్‌ 2; కోహ్లి (బి) చేజ్‌ 52; సూర్యకుమార్‌ (సి) అండ్‌ (బి) చేజ్‌ 8; పంత్‌ నాటౌట్‌ 52; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) షెపర్డ్‌ 33; హర్షల్‌ పటేల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186 వికెట్ల పతనం: 1-10, 2-59, 3-72, 4-106, 5-182 బౌలింగ్‌: అకీల్‌ హొసీన్‌ 4-0-30-0; కాట్రెల్‌ 3-1-20-1; హోల్డర్‌ 4-0-45-0; షెపర్డ్‌ 3-0-34-1; చేజ్‌ 4-0-25-3; ఒడియన్‌ స్మిత్‌ 1-0-10-0; పొలార్డ్‌ 1-0-14-0
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 22; మేయర్స్‌ (సి) అండ్‌ (బి) చాహల్‌ 9; పూరన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) భువనేశ్వర్‌ 62; రోమన్‌ పావెల్‌ నాటౌట్‌ 68; పొలార్డ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178
వికెట్ల పతనం: 1-34, 2-59, 3-159 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-29-1; దీపక్‌ చాహర్‌ 4-0-40-0; చాహల్‌ 4-0-31-1; హర్షల్‌ పటేల్‌ 4-0-46-0; రవి బిష్ణోయ్‌ 4-0-30-1.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని